ఉన్నపళంగా రావాలని మమతా బెనర్జీ పిలుపు... వెంటనే కార్గో విమానం ఎక్కేసిన ప్రశాంత్ కిశోర్!

  • ప్రస్తుతం తృణమూల్ కు సేవలందిస్తున్న ప్రశాంత్ కిశోర్
  • బీజేపీ విమర్శల దూకుడుకు అడ్డుకట్ట వేసే వ్యూహంలో మమత
  • ఢిల్లీ నుంచి కోల్ కతా చేరుకున్న ప్రశాంత్ కిశోర్
తనతో జట్టు కట్టిన రాజకీయ పార్టీలను విజయతీరాలకు చేర్చడంలో సిద్ధహస్తుడిగా పేరున్న ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నుంచి అత్యవసర పిలుపు వచ్చింది. వెంటనే తమకు మార్గదర్శకం చేసేందుకు రావాలంటూ, మమత కార్యాలయం ప్రశాంత్ కిశోర్ ను సంప్రదించింది. ప్రస్తుతం ఆయన తృణమూల్ కాంగ్రెస్ కు తనవంతు సహకారాన్ని అందిస్తూ, రానున్న ఎన్నికల్లో విజయం సాధించేందుకు సలహాలు, సూచనలు ఇస్తున్న సంగతి తెలిసిందే.

కరోనా మహమ్మారిని కట్టడి చేయడంలో మమత సర్కారు విఫలమైందని బీజేపీ విమర్శిస్తుండటం, కేంద్ర అధ్యయన బృందాన్ని రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోవడంతో ఏర్పడిన సంక్లిష్టత తదితరాల నేపథ్యంలో ప్రశాంత్ సలహాలు తీసుకోవాలని మమత భావించినట్టు తెలుస్తోంది. ఇక మమత పిలుపు అందిన వెంటనే ఆయన ఓ కార్గో విమానంలో కోల్ కతాకు చేరుకున్నారు. కరోనా విషయంలో విపక్షాల విమర్శలను తిప్పికొట్టే విషయాన్ని ఆయనే స్వయంగా పర్యవేక్షిస్తారని తెలుస్తోంది.

కాగా, వచ్చే సంవత్సరం పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి ఎన్నికలు జరగాల్సి వుండగా, తిరిగి అధికారంలోకి రావడానికి మమతకు ప్రధాన అడ్డంకి బీజేపీ రూపంలో తగిలింది. గడచిన లోక్ సభ ఎన్నికల్లో భాగంగా వెస్ట్ బెంగాల్ లో 18 స్థానాల్లో గెలిచిన బీజేపీ, అసెంబ్లీ ఎన్నికల్లోనూ గట్టి పోటీ ఇచ్చేలా కనిపిస్తోంది. ఈ క్రమంలోనే సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు ప్రశాంత్ కిశోర్ ను పిలిపించినట్టు సమాచారం.


More Telugu News