కరోనా విజృంభణ నేపథ్యంలో పేద దేశాల్లో ఆక్సిజన్ కొరతపై నిపుణుల ఆందోళన!

  • పేద దేశాల్లో ఆక్సిజన్ నిల్వలు పెంచాలి
  • రోగులకు ఆక్సిజన్‌ అత్యవసరం
  • చైనాలో 20 శాతం మంది కరోనా రోగులకు ఆక్సిజన్ అవసరమైంది
  • రోగుల ఊపిరితిత్తులపై  వైరస్ న్యూమోనియా రూపంలో దాడి చేస్తుంది 
ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభణ నేపథ్యంలో నెలకొన్న ఆక్సిజన్‌ కొరతపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరోనాకు చికిత్స కోసం ప్రపంచంలోని అన్ని దేశాలు ప్రస్తుతం వెంటిలేటర్ల కొనుగోళ్లతో పాటు ఉత్పత్తిపై అధికంగా దృష్టి పెట్టిన విషయం తెలిసిందే.

అయితే, కరోనా రోగులకు అందించే చికిత్సలో ఆక్సిజన్ చాలా ప్రధానమైందని వైద్యులు చెబుతున్నారు. ఆఫ్రికాతో పాటు ఆసియా-పసిఫిక్‌లోని అనేక పేద దేశాల్లో ఆక్సిజన్ కొరత అధికంగా ఉందని చెప్పారు.

కరోనా పేద దేశాల్లోనూ విజృంభిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆయా దేశాల్లో చికిత్సలో భాగంగా ఆక్సిజన్ ప్రధానమని, ఇది రోగుల ప్రాణాలను కాపాడగలదని మెల్‌బోర్న్ విశ్వవిద్యాలయ పరిశోధకుడు డా హమిశ్ గ్రాహం ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ప్రస్తుతం ఆక్సిజన్‌పై దృష్టి పెట్టకుండా కేవలం వెంటిలేటర్ల గురించే ఆలోచించడం సరికాదని ఆయన అంటున్నారు.

ఫిబ్రవరిలో జరిపిన ఓ పరిశోధనలో పలు విషయాలు తెలిశాయని వివరించారు. చైనాలో నమోదైన కరోనా కేసుల్లో 20 శాతం మందికి ఆక్సిజన్ అవసరమైందని హమిశ్ గ్రాహం చెప్పారు. కరోనా రోగుల ఊపిరితిత్తులపై  వైరస్ న్యూమోనియా రూపంలో దాడి చేస్తుందని ఆయన తెలిపారు.

దీంతో ఆక్సిజన్‌ను గ్రహించే శక్తిని ఊపిరితిత్తులు కోల్పోతాయని ఇది చాలా ప్రమాదకరమని అన్నారు. దీంతో రక్తంలో ఆక్సిజన్ స్థాయి పడిపోయి, మృతి చెందే అవకాశం ఉంటుందని హెచ్చరించారు. పేద దేశాల్లో ఆక్సిజన్ కొరత ఆందోళన కలిగిస్తోందని అన్నారు.

ఆయా దేశాల్లో ఆక్సిజన్ కొరతను అధిగమించడానికి సమయం మరికొన్ని రోజులే ఉందని, కరోనా విజృంభణ పెరిగిపోతే పరిస్థితులు చేజారి పోతాయని తెలిపారు. అధిక ఆదాయం ఉన్న దేశాల్లో ఆక్సిజన్ కొరత అంతగా లేకపోయినప్పటికీ పేద దేశాల్లో తీవ్రంగా ఉందన్నారు.


More Telugu News