కర్నూలు సెంటర్ లో ఉరి వేసుకుంటా.. భూమా అఖిలప్రియను నిరూపించమనండి: వైసీపీ ఎమ్మెల్యే హఫీజ్ ఛాలెంజ్

  • కరోనా వ్యాప్తికి ఎమ్మెల్యే  హఫీజ్ తీరే కారణమన్న అఖిలప్రియ
  • చంద్రబాబు మెప్పు కోసమే ఆమె ఆరోపణలు చేస్తున్నారన్న హఫీజ్
  • అవగాహన లేకుండా  మాట్లాడుతున్నారంటూ మండిపాటు
కర్నూలు జిల్లా రాజకీయాల్లో కరోనా వైరస్ కాక పుట్టిస్తోంది. వైసీపీ, టీడీపీల మధ్య యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తోంది. కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, టీడీపీ నాయకురాలు, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. కర్నూలులో కరోనా వ్యాప్తికి హఫీజ్ ఖాన్, ఎంపీ సంజీవ్ కుమార్ తీరే కారణమని అఖిలప్రియ ఆరోపించడం కలకలం రేపింది. ఆమె వ్యాఖ్యలపై హఫీజ్ ఖాన్ తీవ్ర స్థాయిలో స్పందించారు.

అఖిలప్రియ ఆరోపణల్లో వాస్తవం లేదని హఫీజ్ ఖాన్ చెప్పారు. కరోనా వ్యాప్తిని అడ్డుకునే క్రమంలో అందరి కంటే ముందు వరుసలో తాను ఉన్నానని తెలిపారు. మసీదులను మూసివేయించానని, తబ్లిగీ జమాత్ నుంచి వచ్చిన వారి ఇంటింటికీ వెళ్లి వారిని క్వారంటైన్ కేంద్రాలకు తీసుకెళ్లానని చెప్పారు. తాను తప్పు చేసినట్టు నిరూపిస్తే కర్నూలు సెంటర్ లో ఉరి వేసుకుంటానని సవాల్ విసిరారు.

టీడీపీ అధినేత చంద్రబాబు మెప్పుకోసమే అఖిలప్రియ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని హఫీజ్ మండిపడ్డారు. అవగాహన లేకుండా ఆమె మాట్లాడుతున్నారని... జిల్లా సమస్యలు కూడా ఆమెకు తెలియవని ఎద్దేవా చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో మానవత్వంతో పని చేయడం మానేసి... రాజకీయ విమర్శలు చేయడం తగదని హితవు పలికారు. రాష్ట్ర ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే చంద్రబాబు, నారా లోకేశ్ హైదరాబాదులో కూర్చొని ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.


More Telugu News