పెట్రోలు బాటిల్‌తో కరోనా బాధితుడి హంగామా.. నచ్చజెప్పిన ఎమ్మెల్యే

  • కర్ణాటకలోని మాలూరు తాలూకాలో ఘటన
  • సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ హల్‌చల్
  • చర్యలు తీసుకోకుంటే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపు
సోషల్ మీడియాలో తనపై దుష్ప్రచారం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ కరోనా బాధితుడు నానా హంగామా చేసిన ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. మాలూరు తాలూకాలోని నిడఘట్టహళ్లికి చెందిన వ్యక్తి బెంగళూరులోని ఆరోగ్య శాఖలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇటీవల ఇంటికి వచ్చిన అతడు స్నేహితులతో కలిసి పార్టీ చేసుకున్నాడు. విషయం తెలిసిన వైద్యాధికారులు హోం క్వారంటైన్ చేశారు. ఈ విషయాన్ని కొందరు అవకాశంగా తీసుకుని సోషల్ మీడియాలో తన గురించి తప్పుగా ప్రచారం చేస్తూ అవమానించారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు.

నిన్న పెట్రోలు సీసాతో గ్రామ పంచాయతీ కార్యాలయానికి చేరుకుని హల్‌చల్ చేశాడు. గదిలోకి వెళ్లి తలుపు వేసుకున్నాడు. తనపై దుష్ప్రచారం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని, లేదంటే పెట్రోలు పోసుకుని అంటించుకుని, ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించాడు. విషయం తెలిసిన ఎమ్మెల్యే కేవై నంజేగౌడ గ్రామానికి చేరుకుని కిటికీలోంచి అతడితో మాట్లాడి నచ్చజెప్పారు. అతడు బయటకు రావడంతో తిరిగి హోం క్వారంటైన్‌కు తరలించారు.


More Telugu News