అమర్‌నాథ్ యాత్రను రద్దు చేస్తున్నట్టు ప్రకటించి.. ఆ వెంటనే నిర్ణయాన్ని మార్చుకున్న ప్రభుత్వం

  • చర్చనీయాంశమైన ప్రభుత్వ నిర్ణయం
  • జూన్ 23 నుంచి అమర్‌‌నాథ్ యాత్ర ప్రారంభం
  • భక్తుల్లో పలు సందేహాలు
జమ్మూకశ్మీర్ ప్రభుత్వం వెంటవెంటనే తీసుకున్న రెండు నిర్ణయాలు చర్చనీయాంశమయ్యాయి. కరోనా మహమ్మారి భయపెడుతున్న నేపథ్యంలో అమర్‌నాథ్ యాత్రను రద్దు చేస్తున్నట్టు ప్రకటించిన ప్రభుత్వం, ఆ తర్వాత కాసేపటికే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది.

జూన్ 23 నుంచి అమర్‌నాథ్ యాత్ర ప్రారంభం కావాల్సి ఉండగా, దానిని రద్దు చేస్తున్నట్టు ప్రభుత్వం తొలుత ప్రకటించింది. ప్రథమ పూజ, సంపన్నపూజలను యథావిధిగా నిర్వహించనున్నట్టు తెలిపింది. జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ జీసీ మర్ము నేతృత్వంలో జరిగిన శ్రీ అమర్‌నాథ్‌జీ బోర్డు (ఎస్ఏఎస్‌బీ) సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

అయితే, ఆ తర్వాత కాసేపటికే దీనిని ఉపసంహరించుకోవడం చర్చనీయాంశమైంది. జూన్ 23న ప్రారంభం కానున్న ఈ యాత్ర  ఆగస్టు 3 వరకు కొనసాగుతుంది. కశ్మీర్‌లోని ఉగ్రవాద ముప్పు ఉన్న సమయంలోనూ పటిష్ట భద్రత మధ్య ఈ యాత్రను కొనసాగిస్తూ వస్తున్నారు. అయితే, నిమిషాల వ్యవధిలోనే రెండు నిర్ణయాలు తీసుకోవడంతో  యాత్ర ఉంటుందా? లేదా? అన్నదానిపై భక్తుల్లో సందేహాలు వ్యక్తమవుతున్నాయి.


More Telugu News