శానిటేషన్, డిఆర్‌ఎఫ్, ఎంటమాలజీ సిబ్బందితో కలిసి భోజనం చేసిన మంత్రి కేటీఆర్‌

  • కుటుంబ స‌భ్యుల ఆరోగ్య ప‌రిస్థితిని అడిగి తెలుసుకున్న మంత్రి 
  • వైద్యులు, పోలీస్ లకు దీటుగా పనిచేస్తున్నారని అభినందించిన కేటీఆర్‌
  • కేటీఆర్‌తో పాటు భోజ‌నం చేసిన మంత్రి శ్రీ‌నివాస్‌గౌడ్‌, మేయ‌ర్
సంజీవ‌య్య పార్కు ఎదురుగా ఉన్న డి.ఆర్‌.ఎఫ్ శిక్ష‌ణా కేంద్రంలో బుధ‌వారం శానిటేషన్, డిఆర్ఎఫ్, ఎంటమాలజీ సిబ్బందితో కలిసి తెలంగాణ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె తారక రామారావు సామాజిక దూరం పాటిస్తూ భోజ‌నం చేశారు. లాక్ డౌన్ సమయంలో మీరందరూ వైద్యులు, పోలీస్ లకు దీటుగా పనిచేస్తున్నారని అభినందించారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి కేటీఆర్‌ ప్రతి కార్మికుడిని పలకరించి, యోగక్షేమాలు తెలుసుకున్నారు. కొద్ది మందికి స్వ‌యంగా వ‌డ్డించారు. కుటుంబ స‌భ్యుల ఆరోగ్య ప‌రిస్థితిని, వారు ఏం చేస్తున్నారో అని అడిగి తెలుసుకున్నారు. ప్ర‌తి ఒక్క‌రూ జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని సూచించారు.

క‌రోనా నియంత్ర‌ణ‌లో విశిష్ట సేవ‌లు అందిస్తున్న శానిటేష‌న్‌, ఎంట‌మాల‌జి, డి.ఆర్‌.ఎఫ్ సిబ్బందికి కూడా పూర్తి జీతంతో పాటు ప్రోత్సా‌హ‌కాల‌ను ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఇస్తున్నార‌ని గుర్తుచేశారు. ప్ర‌జ‌ల కొర‌కు నిరంత‌రం ప‌నిచేసేవారిని ప్ర‌భుత్వం గౌర‌విస్తుంద‌ని పేర్కొన్నారు. అలాగే క‌రోనా వైర‌స్ వ్యాప్తిని అరిక‌ట్టేందుకు తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌ల గురించి మీ చుట్టుప్ర‌క్క‌ల వారికి వివ‌రించాల‌ని కోరారు. వ‌ర్షాకాలం రాబోతున్నందున దోమ‌ల వ్యాప్తిని అరిక‌ట్టుట‌కై ఇప్ప‌టి నుండే చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని ఎంట‌మాల‌జి విభాగానికి సూచించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్యే బాల్క సుమన్, పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ అర్వింద్ కుమార్, డిప్యూటి మేయర్ మ‌హ్మ‌ద్‌ బాబా ఫసియుద్దీన్, ఇ.వి.డి.ఎం డైరెక్ట‌ర్ విశ్వ‌జిత్ కంపాటి, శానిటేష‌న్ అద‌న‌పు క‌మిష‌న‌ర్ రాహుల్‌రాజ్‌, సికింద్రాబాద్ జోన‌ల్ క‌మిష‌న‌ర్ శ్రీ‌నివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


More Telugu News