నా భర్త చివరి కోరిక తీర్చండి: కరోనాతో చనిపోయిన చెన్నై డాక్టర్ భార్య విజ్ఞప్తి

  • కరోనాతో చనిపోయిన చెన్నై డాక్టర్ సైమన్
  • అంత్యక్రియలను అడ్డుకున్న స్థానికులు
  • అర్ధరాత్రి గుంత తవ్వి పూడ్చిపెట్టిన సహచర వైద్యుడు
తన భర్త అంత్యక్రియలను సంప్రదాయ బద్దంగా జరిపించాలని తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామికి కరోనా కారణంగా మృతి చెందిన డాక్టర్ సైమన్ హెర్క్యులెస్ భార్య ఆనంది సైమన్ విజ్ఞప్తి చేశారు. హెర్క్యులెస్ చివరి కోరిక ప్రకారం ఆయన మృతదేహాన్ని చెన్నైలోని కీల్ పాక్ శ్మశానవాటికలో ఖననం చేయాలని కోరారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు.

'కరోనాతో నా భర్త చనిపోయారు. ఒకవేళ ఈ మహమ్మారి వల్ల తాను చనిపోతే మా సంప్రదాయాల ప్రకారం ఖననం చేయాలని నా భర్త చివరి కోరిక కోరారు. కరోనా కట్టడిలో ముఖ్యమంత్రి సమర్థవంతంగా పని చేస్తున్నారు. నా భర్త చివరి కోరికను కూడా నెరవేర్చండి' అని కోరుతూ వీడియోలో ఆనంది కంటతడి పెట్టారు.

'నా భర్త మృతదేహాన్ని సీల్డ్ కవర్ చుట్టి పూడ్చారు. ఆయన మృతదేహాన్ని అలాగే బయటకు తీసి మా మత విశ్వాసాల మేరకు అంత్యక్రియలను నిర్వహించేందుకు అనుమతించండి. డెడ్ బాడీ వల్ల వైరస్ వ్యాప్తి చెందదు. ఇద్దరు పిల్లలను కలిగి ఉన్న వితంతువును నేను. నా భర్త ఆఖరి కోరిక తీర్చండి' అని ఆనంది కోరారు.

న్యూరో సర్జన్ అయిన డాక్టర్ సైమన్ విధి నిర్వహణలో సేవలు అందిస్తుండగా కరోనా సోకి, ప్రాణాలు కోల్పోయారు. ఆయనకు అంత్యక్రియలను నిర్వహించేందుకు యత్నించిన వైద్య సిబ్బందిపై స్థానికులు దాడి చేశారు. ఈ నేపథ్యంలో, ఆయన సహచరుడైన డాక్టర్ ప్రదీప్ కుమార్... అర్ధరాత్రి తానే స్వయంగా గుంత తవ్వి సైమన్ మృతదేహాన్ని పూడ్చిపెట్టారు. ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది. ప్రాణాలొడ్డి పని చేస్తున్న వైద్యులకు ఇచ్చే గౌరవం ఇదేనా? అనే విమర్శలు వెల్లువెత్తాయి.


More Telugu News