నన్ను మ్యాచ్‌ ఫిక్సింగ్ చేయమంటే కనుక వసీం అక్రమ్‌ను చంపేసేవాడ్ని: షోయబ్ అక్తర్

  • అలాంటి పని చేయమని ఎప్పుడూ కోరలేదని వెల్లడి
  • కెరీర్ ఆరంభంలో అక్రమ్ సాయం చేశాడన్న అక్తర్
  • మ్యాచ్ ఫిక్సర్లంటే తనకు నచ్చరన్న పాక్ మాజీ పేసర్
జాతీయ జట్టు ప్రయోజనాలను పణంగా పెట్టి మ్యాచ్  ఫిక్సింగ్ చేసే  వ్యక్తులు అంటే తనకు అస్సలు నచ్చరని పునరుద్ఘాటించిన  పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తనను మ్యాచ్ ఫిక్సింగ్ చేయమని పాక్ మాజీ కెప్టెన్ వసీం అక్రమ్ కోరివుంటే అతడిని చంపేసేందుకు కూడా వెనుకాడే వాడిని కాదన్నాడు.

‘వసీం అక్రమ్ నన్ను ఫిక్సింగ్ చేయమని కోరి ఉంటే అతణ్ని నాశనం చేసేవాడ్ని. చంపేసేవాడ్ని కూడా. కానీ, అక్రమ్ ఎప్పుడూ నన్ను అలా అడగలేదు’ అని అక్తర్ పేర్కొన్నాడు. 1990ల్లో పాకిస్థాన్ ఆడిన కొన్ని మ్యాచ్‌లు చూశానని చెప్పాడు.  నాడు అక్రమ్ అద్భుత బౌలింగ్‌తో పాక్‌ను క్లిష్ట పరిస్థితుల నుంచి  గట్టెక్కించాడని చెప్పాడు.

తన కెరీర్ మొదట్లో కూడా అక్రమ్ అండగా నిలిచాడన్నాడు. ఏడెనిమిది సంవత్సరాలు వసీంతో కలిసి ఆడానని తెలిపాడు. అప్పుడు ప్రత్యర్థి టాపార్డర్ వికెట్లు తీసే బాధ్యతను తీసుకున్న అక్రమ్ తనకు టెయిలెండర్ పని పట్టేందుకు మార్గం సుగమం చేసేవాడన్నాడు. అలాగే, తనకు ఇష్టమైన ఎండ్‌ నుంచి బౌలింగ్‌ చేసే అవకాశం ఇచ్చేవాడని తెలిపాడు.

 తాను ఆడుతున్న రోజుల్లో అక్రమ్‌కు ఎప్పుడూ కృతజ్ఞతలు తెలుపలేదని, అందుకు బాధపడుతున్నానని షోయబ్ చెప్పాడు. ఆమధ్య పాత మ్యాచ్‌ల వీడియోలు చూసిన వెంటనే అక్రమ్‌కు ఫోన్‌ చేశానని, కలిసి ఆడే రోజుల్లో అతడి గొప్పతనాన్ని గుర్తించనందుకు క్షమాపణలు చెప్పానని వెల్లడించాడు. కాగా, పాకిస్థాన్ క్రికెట్‌లో మ్యాచ్‌- ఫిక్సింగ్ సమస్య గురించి గతేడాది కూడా అక్తర్ సంచలన విషయాలు బయటపెట్టాడు.


More Telugu News