పెళ్లిళ్లకు వెళ్లి లాక్‌డౌన్‌తో చిక్కుకుపోయిన బంధువులు.. నెల రోజులుగా తిప్పలు

  • మహారాష్ట్రలోని గడ్చిరోలిలో ఘటన
  • 20 రోజులుగా ఆహారం అందిస్తోన్న సీఆర్‌పీఎఫ్‌ 
  • ఈ క్రమంలో సాయం కోరిన  గ్రామంలోని ఇతర ప్రజలు
  • 600 మందికి రోజుకి రెండు పూటలా భోజనం 
  • సేవలు అందించడానికి తన పెళ్లి వాయిదా వేసుకున్న ఏఎస్‌ఐ
మావోయిస్టుల ప్రభావం అధికంగా ఉండే మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా దేసాయిగంజ్‌ గ్రామంలో దాదాపు నెల రోజుల క్రితం జరిగిన రెండు పెళ్లిళ్లకు బంధువులు వచ్చారు. పెళ్లిళ్లు జరిగిన మరుసటి రోజే దేశ వ్యాప్తంగా జనతా కర్ఫ్యూ, అనంతరం లాక్‌డౌన్‌ విధించారు.

దీంతో ఈ పెళ్లిళ్లకు వచ్చిన వారిలో 40 మంది ఆ గ్రామంలోనే ఉండిపోవాల్సి  వచ్చింది. వారంతా దినసరి కూలీలే.. తినడానికి తిండి కూడా దొరకని స్థితిలో ఇబ్బందులు పడ్డారు.   పెళ్లిళ్లు నిర్వహించిన కుటుంబాలు కూడా పేద కుటుంబాలే కావడంతో వచ్చిన బంధువులకు సుదీర్ఘకాలంపాటు భోజనం పెట్టే స్తోమత లేదు.

ఇదిలావుండగా, ఆ గ్రామం మావోయిస్టుల ప్రభావిత ప్రాంతం కావడంతో అక్కడ సీఆర్‌పీఎఫ్ జవాన్లు విధులు నిర్వహిస్తుంటారు. దేసాయిగంజ్‌లో చిక్కుకు పోయిన పెళ్లి బృందాల గురించి వారు తెలుసుకున్నారు. దీంతో 20 రోజులుగా వారే పెళ్లి బృందాలకు  రెండు పూటల భోజనం పెడుతున్నారు.  

అయితే, వారికి భోజనం అందిస్తున్న నేపథ్యంలో అదే ప్రాంతంలోని ఇతర ప్రజలు కూడా లాక్‌డౌన్‌ వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు తెలుసుకున్నారు. దీంతో వారికి కూడా భోజనం అందిస్తున్నారు. ఇలా రోజుకి దాదాపు  600 మందికి సీఆర్‌పీఎఫ్ జవాన్లు ఆహారం అందిస్తున్నారు.

ఆ ప్రాంతంలోని ప్రజలకు పప్పు, సబ్బులు వంటి ఇతర నిత్యావసర వస్తువులు కూడా అందిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఏఎస్ఐ సోను కుమార్‌కు ఏప్రిల్ 5న పెళ్లి జరగాల్సి ఉంది. ఆయన గడ్చిరోలి లో ప్రస్తుతం పనిచేస్తున్నాడు. తన పెళ్లిని సైతం వాయిదా వేసుకుని గడ్చిరోలిలోనే ఉంటూ సేవలు అందిస్తున్నారు. పెళ్లి కోసం తీసుకున్న సెలవులను రద్దు చేసుకున్నాడు.


More Telugu News