కరోనా వైరస్ పుట్టుకపై మరింత స్పష్టతనిచ్చిన ప్రపంచ ఆరోగ్య సంస్థ

  • జంతువుల ద్వారానే కరోనా వ్యాప్తి జరిగిందన్న డబ్ల్యూహెచ్ఓ
  • ల్యాబ్ లో పుట్టిందనడానికి ఆధారాల్లేవని వెల్లడి
  • భాగస్వామ్య దేశాల మధ్య అంతరాలను తొలగిస్తామని వ్యాఖ్యలు
ప్రపంచాన్ని గజగజ వణికిస్తున్న కరోనా వైరస్ పుట్టుకపై ఇప్పటికీ భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇది ప్రయోగశాలలో పుట్టిన వైరస్ అని అమెరికా ఆరోపిస్తుండగా, వైరస్ ల్యాబ్ లో పుట్టిందేమోనన్న అంశంపై లోతైన విచారణ జరగాలని రష్యా సూచిస్తోంది. అయితే, ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ఈ వాదనల్లో పసలేదని అంటోంది. అందుబాటులో ఉన్న ఆధారాలన్నీ పరిశీలించి చూస్తే కరోనా వైరస్  చైనాలోని కొన్ని రకాల జంతువుల నుంచే మానవులకు సోకినట్టుగా స్పష్టమవుతోందని, ల్యాబ్ లోనో, మరెక్కడైనా గానీ ఈ వైరస్ ఉత్పత్తి చేయలేదని ఓ ప్రకటనలో వెల్లడించింది.

బహుశా ఇది జంతువుల నుంచే వ్యాప్తి చెందివుంటుందని డబ్ల్యూహెచ్ఓ అధికార ప్రతినిధి ఫదేలా చైబ్ అన్నారు. అయితే, జంతుప్రపంచం అవధులు దాటి ఇది మానవులకు ఎలా వ్యాపించిందన్న విషయంలో స్పష్టత లేదని పేర్కొన్నారు. ఏదో ఒక బలమైన వాహకం ఉండే అవకాశం ఉందని, దానిద్వారానే మానవాళికి సోకినట్టు భావించాల్సి వస్తోందని వివరించారు. గబ్బిలాలే ఈ వైరస్ కు ప్రధాన వాహకాలన్న అభిప్రాయాలు వినిపిస్తున్నా, వాటి నుంచి మనుషులకు ఎలా సోకిందన్నది పరిశోధించాల్సిన అంశం అని చైబ్ స్పష్టం చేశారు.

కాగా, ఇలాంటి ప్రమాదకర వైరస్ లు ల్యాబ్ నుంచి లీకయ్యే అవకాశాలు ఉన్నాయా? అన్న ప్రశ్నకు ఆమె సమాధానం ఇవ్వలేదు. అయితే వుహాన్ ల్యాబ్ లోనే ఈ వైరస్ జన్మించిందన్న ట్రంప్ వ్యాఖ్యలపై స్పందిస్తూ, తమ భాగస్వామ్య దేశాల మధ్య ఏర్పడిన అపోహలు, అంతరాలను తొలగించేందుకు కృషి చేస్తామని చెప్పారు.


More Telugu News