23న బ్లాక్ డే నిర్వహించాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నిర్ణయం

  • 22న రాత్రి కొవ్వొత్తులతో నిరసన
  • 23న బ్లాక్ బ్యాడ్జీలతో విధులు
  • డాక్టర్ల రక్షణకు చట్టం చేయాలని ఐఎంఏ డిమాండ్
కరోనా మహమ్మారిని నిలువరించేందుకు ప్రాణాలను పణంగా పెట్టి వైద్యులు పోరాడుతూ ఉంటే, కొందరు దాడులకు దిగుతూ ఉండటాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన ఐఎంఏ (ఇండియన్ మెడికల్ అసోసియేషన్) నిరసన తెలపాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా 23వ తేదీన బ్లాక్ డే నిర్వహించనున్నట్టు ప్రకటించింది. 22న రాత్రి 9 గంటలకు అన్ని ఆసుపత్రుల్లోని వైద్యులూ కొవ్వొత్తులను వెలిగించి నిరసన తెలియజేయాలని, 23న నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరు కావాలని కోరుతూ ఐఎంఏ గౌరవ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ వీ అశోకన్, ఓ ప్రకటనలో తెలిపారు.

వైద్యులపై ఉమ్మి వేసిన ఘటనలు జరిగాయని, దుర్భాషలాడుతున్నారని, కొన్ని చోట్ల భౌతిక దాడులు జరిగాయని ఆయన గుర్తు చేశారు. ఎంతో శ్రమిస్తున్న డాక్టర్లపై దాడులు అత్యంత హేయమైన చర్యగా అభివర్ణించిన ఆయన, తాము కూడా లాక్ డౌన్ పాటిస్తూ ఇంట్లోనే కూర్చుంటే పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాలని ప్రజలను కోరారు. డాక్టర్లకు రక్షణ కల్పించేందుకు ఓ చట్టాన్ని చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.


More Telugu News