ఇప్పటికిప్పుడు రాపిడ్ కిట్లను వాడవద్దంటూ కేంద్రం అత్యవసర ఆదేశాలు!

  • టెస్టింగ్ కిట్ల ఫలితాలు సరిగ్గా లేవని ఆరోపణలు
  • రెండు రోజులు వినియోగించవద్దు
  • ఆరోపణలపై విచారణ జరుపుతామన్న ఐసీఎంఆర్
దేశంలోని వివిధ రాష్ట్రాలకు అందుబాటులోకి వచ్చిన రాపిడ్ యాంటీ బాడీ టెస్ట్ కిట్లను ఇప్పటికిప్పుడు వినియోగించవద్దని ఐసీఎంఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్) ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలకూ, కనీసం రెండురోజుల పాటు రాపిడ్ టెస్టింగ్ కిట్లను వాడద్దంటూ ఆదేశించింది. ఈ టెస్టింగ్ కిట్లు తప్పుడు ఫలితాలను ఇస్తున్నాయని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో, వీటిని మరోసారి పరిశీలించాలని నిర్ణయించామని, అందుకు రెండు రోజుల సమయం పడుతుందని ఐసీఎంఆర్ ప్రకటించింది.

కాగా, ఈ టెస్టింగ్ కిట్స్ తప్పుడు ఫలితాలు ఇస్తున్నాయని రాజస్థాన్ సహా పలు రాష్ట్రాలు ఆరోపించిన సంగతి తెలిసిందే. చైనా కిట్లను వాడబోమని, పీపీఆర్ విధానంలోనే పరీక్షలు చేస్తామని పలు రాష్ట్రాలు ఐసీఎంఆర్ కు ఇప్పటికే స్పష్టం చేశాయి. ఆర్ఏటీ కిట్ల ద్వారా వస్తున్న కచ్ఛితత్వం చాలా తక్కువగా ఉందని, కేవలం 5.4 శాతం కచ్చితత్వాన్ని మాత్రమే ఇవి చూపిస్తున్నాయన్న విమర్శలు ఉన్నాయి.


More Telugu News