లాక్ డౌన్ తొలగింపుపై నేడు కేంద్ర మంత్రుల కీలక సమావేశం!

  • రాజ్ నాథ్ సింగ్ నేతృత్వంలో సమావేశం
  • కేంద్ర వ్యూహాలపైనే ప్రధాన చర్చ
  • రెడ్ జోన్ ప్రాంతాల్లో మరింత కఠినమే!
వచ్చే నెల 3వ తేదీ తరువాత లాక్ డౌన్ ను ఏ విధంగా తొలగించాలన్న విషయమై చర్చించేందుకు నేటి సాయంత్రం, కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ నేతృత్వంలో కీలక సమావేశం జరుగనుంది. పలువురు కేంద్ర మంత్రులతో చర్చించనున్న రాజ్ నాథ్ సింగ్, ఆపై సమావేశం వివరాలను ప్రధాని నరేంద్ర మోదీకి చేరవేయనున్నారు. లాక్ డౌన్ ఎత్తివేతపై అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించడమే ఈ సమావేశం ప్రధాన ఉద్దేశమని తెలుస్తోంది.

ఇప్పటికే ఇండియాలో ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం కాగా, మరోసారి లాక్ డౌన్ పొడిగింపు ఉండే అవకాశాలు లేవని, అయితే, రెడ్ జోన్లను మినహాయిస్తూ, మిగతా ప్రాంతాల్లో నిబంధనలను సడలించవచ్చని తెలుస్తోంది. ప్రజల మధ్య సామాజిక దూరం, మాస్క్ లను తప్పనిసరి చేయడం వంటి నియమాలతో లాక్ డౌన్ సడలింపు ఉంటుందని కేంద్ర వర్గాలు అంటున్నాయి. ఇదే సమయంలో రెడ్ జోన్లలో మరింత కఠినంగా ఉండేలా నిబంధనలను మార్చాలని, కంటైన్ మెంట్ జోన్లపై తీసుకోవాల్సిన చర్యలపైనా వీరి మధ్య చర్చ జరుగుతుందని తెలుస్తోంది.


More Telugu News