తెలంగాణ నుంచి కాలినడకన ఛత్తీస్‌గఢ్‌కు.. 3 రోజుల నడక తర్వాత ప్రాణాలు కోల్పోయిన 12 ఏళ్ల బాలిక!

  • 150 కిలోమీటర్లు నడిచిన వైనం
  • ఇంటికి 14 కిలోమీటర్ల దూరంలో మృతి
  • ఒక్కగానొక్క కూతుర్ని కోల్పోయిన తల్లిదండ్రులు
  • పోషకాహార లోపం, డీహైడ్రేషన్ కారణంగా మృతి చెందిందన్న వైద్యులు
తెలంగాణ నుంచి ఛత్తీస్‌గఢ్‌కు కాలినడకన తమ కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లిన 12 ఏళ్ల బాలిక.. 3 రోజుల పాటు దాదాపు 150 కిలోమీటర్లు నడిచి చివరికి ప్రాణాలు కోల్పోయింది. లాక్‌డౌన్‌ కారణంగా ప్రజా రవాణా వ్యవస్థ బంద్‌ అయిన విషయం తెలిసిందే. లాక్‌డౌన్‌ను పొడిగించడంతో కూలీలు తమ సొంత గ్రామాలకు కాలినడకన వెళ్తున్నారు.

ఈ క్రమంలో తొందరగా ఇంటికి వెళ్లాలని అటవీ మార్గాన కూడా నడుస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ బాలిక ప్రాణాలు కోల్పోయింది. మరి కొన్ని గంటల్లో సొంత గ్రామానికి చేరాల్సిన ఆ బాలిక కానరాని లోకాలకు వెళ్లిపోయింది. అప్పటికే 150 కిలోమీటర్లు నడిచిన ఆమె.. తన గ్రామానికి కేవలం 14 కిలోమీటర్ల దూరంలో తీవ్ర అనారోగ్యానికి గురి కావడంతో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది.

అండొరం మక్డం (32), సుకమతి (30) కి జామ్లో మక్డం(12) అనే ఒక్కగానొక్క కూతురు ఉంది. తెలంగాణలోని ఓ గ్రామానికి రెండు నెలల  క్రితం ఆ కుటుంబంతో పాటు మరి కొంత మంది  మిర్చి ఏరివేత కూలి పనులకు వచ్చారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో 13 మంది ఛత్తీస్‌గఢ్‌లోని సొంత గ్రామానికి కాలి నడకన వెళ్లాలని ప్రయాణం ప్రారంభించారు.

బీజాపూర్ జిల్లా సరిహద్దుకు చేరుకోగానే జామ్లోకు కడుపునొప్పి వచ్చి, అక్కడికక్కడే కుప్పకూలింది. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా మారి మృతి చెందింది. దీంతో  భండర్‌పాల్ గ్రామస్తుల సాయంతో కుటుంబ సభ్యులు జామ్లో ఆరోగ్య పరిస్థితి గురించి పోలీసులకు తెలిపారు.

ఘటనా స్థలికి చేరుకున్న బీజాపూర్‌కు చెందిన వైద్యులు వారిని క్వారంటైన్ కు తరలించారు. ఆమె పోషకాహార లోపం, డీహైడ్రేషన్ కారణంగా మృతి చెందిందని వైద్యులు చెప్పారు. కాగా, ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం బాలిక కుటుంబానికి రూ.లక్ష పరిహారం ప్రకటించింది.


More Telugu News