ఇప్పటివరకూ చూసిన కరోనా ప్రభావం స్వల్పమే... మున్ముందు మహమ్మారి విశ్వరూపం కనిపిస్తుందన్న డబ్ల్యూహెచ్ఓ!

  • ఇప్పటికే 25 లక్షల మందికి సోకిన కరోనా
  • నిదానంగా విజృంభిస్తోందన్న టీడ్రాస్ అడ్హనామ్
  • నియంత్రణ చర్యల కారణంగానే వ్యాప్తి నిదానం
  • ఆఫ్రికా దేశాల్లో పంజా విసురుతుందని హెచ్చరిక
ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారి, ఇప్పటికే 25 లక్షల మందిని బాధిస్తూ, 1.66 లక్షలకు పైగా ప్రాణాలను బలిగొంది. వైరస్ ప్రభావంతో ఎన్నో దేశాలు ఆర్థిక మాంద్యంలోకి కూరుకుపోయాయి. వ్యవస్థలు స్తంభించాయి. లాక్ డౌన్ తో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కరోనా నుంచి నిదానంగా బయట పడుతున్నామన్న సంకేతాలు కనిపిస్తున్నాయని చాలా దేశాలు ఊపిరి పీల్చుకుంటున్న వేళ, డబ్ల్యూహెచ్ఓ (వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్) సంచలన వ్యాఖ్యలు చేసింది.

ఇప్పటివరకూ చూసిన కరోనా ప్రభావం స్వల్పమేనని, ముందుముందు మహమ్మారి విశ్వరూపం కనిపిస్తుందని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టీడ్రాస్ అడ్హనామ్ వ్యాఖ్యానించారు. ఎన్నో దేశాల్లో కరోనా ఇప్పుడిప్పుడే పంజా విసరడం ప్రారంభించిందని, కొన్ని దేశాల్లో నియంత్రణా చర్యల మూలంగా కొంత మేరకు నిదానించిందని గుర్తు చేసిన ఆయన, లాక్ డౌన్ ను శాశ్వతంగా అమలుచేసే వీలు లేదని అన్నారు.

సమీప భవిష్యత్తులో ఆరోగ్య విధానం తక్కువగా అభివృద్ధి చెందిన ఆఫ్రికా దేశాల్లో కరోనా మరణమృదంగం మోగించనుందని జాన్ హాప్కిన్స్ యూనివర్శిటీ అంచనా వేసింది. ఇదే విషయాన్ని గుర్తు చేసిన టీడ్రాస్... కరోనాకు, 1918లో వచ్చిన స్పానిష్ ఫ్లూకు ఎన్నో సారూప్యాలున్నాయని, స్పానిష్ ఫ్లూ తరహాలోనే, కరోనా సైతం నిదానంగా విజృంభించి ప్రాణాలు తీస్తుందని హెచ్చరించారు.

జెనీవాలో మీడియాతో మాట్లాడిన ఆయన, "ఇది అత్యంత ప్రమాదకరం. మెల్లగా తన ప్రభావాన్ని చూపిస్తోంది. 1918లో దాదాపు కోటి మందిని మృత్యువాత పడేసిన ఫ్లూ వంటిదే ఇది కూడా. అయితే ఇప్పుడు మన ముందు నాడు అందుబాటులో లేని సాంకేతికత ఉంది. మహమ్మారి ఉత్పాతాన్ని నివారించే వీలుంది. ఆ స్థాయిలో ప్రపంచానికి కష్టం రాకుండా చూడవచ్చు. మహమ్మారి విశ్వరూపం ముందు ముందు కనిపిస్తుందని నేను నమ్ముతున్నాను. ఈ దురదృష్టాన్ని నివారించేందుకు అన్ని దేశాలూ కలవాలి. ఈ వైరస్ చూపే ప్రభావంపై ఇప్పటికీ ఎంతో మందికి అవగాహన లేదు" అని అన్నారు.


More Telugu News