వర్క్ ఫ్రం హోం.. ఇక కంటిన్యూ!

  • కరోనా విపత్తు తొలగిన తర్వాత కూడా ఇంటి నుంచే పని
  • కార్మిక చట్టాన్ని సవరించే పనిలో కేంద్రం?
  • త్వరలో మార్గదర్శకాల జారీ!
కరోనా వైరస్ లాక్‌డౌన్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా చాలా కంపెనీలు ఉద్యోగులకు ఇంటి నుంచి పనిచేసుకునే అవకాశం కల్పించాయి. ఫలితంగా లాక్‌డౌన్ సమయంలోనూ తమ కార్యకలాపాలు కొనసాగించగలుగుతున్నాయి. అయితే, ఈ వర్క్ ఫ్రం హోం విధానం కరోనా విపత్తు తొలగిపోయిన తర్వాత కూడా కొనసాగే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ విషయాన్ని ముందే గుర్తించిన కేంద్ర ప్రభుత్వం త్వరలోనే వర్క్ ఫ్రం హోంకు సంబంధించి మార్గదర్శకాలను విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలలో పనిచేసే ఉద్యోగుల ప్రయోజనాల పరిరక్షణ కోసం మార్గదర్శకాలను రూపొందించే పనిలో ఉందని సమాచారం. ముఖ్యంగా ఉద్యోగుల పనిగంటలు, పని వాతావరణం, వేతనం మొదలైన వాటిపై కేంద్రం తన మార్గదర్శకాల్లో ప్రత్యేకంగా పేర్కొనే అవకాశం ఉందని తెలుస్తోంది. వర్క్ ఫ్రం హోంకు సంబంధించి ప్రస్తుత కార్మిక చట్టంలో ఎటువంటి మార్గదర్శకాలు లేవు. ఈ నేపథ్యంలో ప్రత్యేక మార్గదర్శకాలు అవసరమని ప్రభుత్వం భావిస్తున్నట్టు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.


More Telugu News