ప్రపంచ చరిత్రలో కనీవినీ ఎరుగని స్థాయికి క్రూడాయిల్ పతనం... ఎదురు డబ్బులు ఇచ్చుకోవాల్సిన పరిస్థితి!

  • మైనస్ 28 డాలర్లకు బ్యారల్ ధర
  • డిమాండ్ లేక పెరిగిపోయిన నిల్వలు
  • ఎదురు డబ్బులిచ్చి తగ్గించుకోవాల్సిన పరిస్థితి
ప్రపంచ చరిత్రలో ముడిచమురు ధర కనీవినీ ఎరుగని స్థాయికి పడిపోయింది. న్యూయార్క్ ఫ్యూచర్స్ మార్కెట్ నైమెక్స్ లో డబ్ల్యూటీఐ మే నెల కాంట్రాక్టు క్రూడ్ ధర ఒక దశలో మైనస్ 28 డాలర్లకు పడిపోయింది. ప్రపంచవ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతున్న సమయంలో, ముడిచమురు నిల్వలు పేరుకుపోతూ, ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి జారుతున్నట్టు స్పష్టమైన సంకేతాలు కనిపిస్తుంటే, కొనుగోలుదారులకు ఎదురు డబ్బులు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడిందని చమురు రంగ వ్యాపారులు వాపోతున్నారు.

సమీప భవిష్యత్తులో ఆర్థిక రికవరీ కనిపించడం లేదని, తమ వద్ద అధికంగా ఉన్న నిల్వలను తగ్గించుకునేందుకు చమురు ఉత్పత్తి దేశాలు, ఎదురు డబ్బిచ్చి మరీ వాటిని సరఫరా చేయాల్సిన పరిస్థితి తలెత్తిందని గగ్గోలు పెడుతున్నాయి.

వాస్తవానికి ఈ సంవత్సరం ఆరంభంలో క్రూడాయిల్ ధర భారీగా పెరిగి 52 వారాల గరిష్ఠానికి చేరింది. జనవరిలో యూఎస్ జరిపిన వైమానిక దాడుల్లో ఇరాన్ మేజర్ ఖాసీమ్ సులేమానీ మరణంతో ఏర్పడిన ఉద్రిక్తత, ముడి చమురు ధరను ఎగదోసింది. ఆపై ఇరాన్ పై అమెరికా ఆంక్షలు, రష్యా, సౌదీ అరేబియాలు పోటాపోటీగా చమురును ఉత్పత్తి చేయడంతో ధర తగ్గుతూ వచ్చింది. ఇక ఇప్పుడు కరోనా ప్రభావం, లాక్ డౌన్ కారణంగా పాతాళానికి పడిపోయింది.

ఇక చమురు గండం నుంచి గట్టెక్కేందుకు ఒపెక్ దేశాలు చమురు ఉత్పత్తిని రోజుకు 10 మిలియన్ బ్యారళ్ల మేరకు తగ్గించాలని నిర్ణయించాయి. అదే జరిగితే, ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమవుతుంది. అయినా, అంతకుమించి మరో మార్గం వారికి కనిపించడం లేదు. ఉత్పత్తిని తగ్గించినా, డిమాండ్ తో పోలిస్తే, అధిక చమురు అందుబాటులో ఉంటుందని, నిల్వలు పెరిగిపోతూనే ఉంటాయన్న ఆందోళన కూడా ఉంది.

ఈ పరిస్థితుల్లో ఎలియట్‌వేవ్‌ సిద్ధాంతాన్ని నిపుణులు గుర్తు చేస్తున్నారు. 2009లో ఎలియట్‌వేవ్‌ ఇంటర్నేషనల్‌ వ్యవస్థాపకుడు రాబర్ట్‌ ప్రెషెర్‌ చెబుతూ, మరో పదేళ్లలో ముడిచమురు ధర 4 నుంచి 10 డాలర్ల స్థాయికి పడిపోతుందని ఊహించాడు. 11 సంవత్సరాల క్రితం ఆయన వేసిన అంచనాలు ఇప్పుడు నిజమవుతున్నాయి. ముడి చమురు ధర మరోసారి ఆల్‌ టైమ్‌ గరిష్ఠ స్థాయి అయిన 147.67 డాలర్లు చేరాలంటే చాలా సంవత్సరాలే పడుతుంది.


More Telugu News