కరోనా బారిన పడిన ఇటలీ దేశస్తుడికి ప్రాణాలు పోసిన కేరళ డాక్టర్లు

  • భారత్ పర్యటనకు వచ్చిన ఇటాలియన్ 
  • కేరళలో మార్చి 13న కరోనా పాజిటివ్ గా నిర్ధారణ
  • తిరువనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స
భారత్ లో కరోనా ప్రవేశించిన తొలినాళ్లలో కేరళలో తీవ్ర కలకలం రేగింది. గాడ్స్ ఓన్ కంట్రీగా పేరుగాంచిన ఈ రాష్ట్రంలోనే అధిక సంఖ్యలో కేసులు వెల్లడయ్యాయి. అయితే కట్టుదిట్టమైన నివారణ చర్యలతో కేరళ త్వరగానే కోలుకుంది. ఇప్పటివరకు అక్కడ 402 పాజిటివ్ కేసులు నమోదు కాగా, కేవలం మూడు మరణాలు మాత్రమే సంభవించాయి. తాజాగా కేరళ డాక్టర్లు ఓ ఇటలీ దేశస్తుడ్ని కరోనా బారి నుంచి కాపాడారు.

ఇటలీకి చెందిన రాబర్టో టొనిజ్జో గత నెలలో భారత్ వచ్చాడు. కేరళలోని వర్కాలా ప్రాంతానికి వచ్చిన టొనిజ్జో మార్చి 13న కరోనా పాజిటివ్ అని తేలింది. ఇటీవలే అతడికి కరోనా నయమైంది. తిరువనంతపురం ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు అందించిన చికిత్సతో టొనిజ్జో సంపూర్ణ ఆరోగ్యం సంతరించుకున్నాడు. దీనిపై టొనిజ్జో మాట్లాడుతూ, ఇక్కడి డాక్టర్లు, ఇతర సిబ్బందికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని పేర్కొన్నాడు.

కరోనా నుంచి కోలుకోవడం పట్ల ఎంతో సంతోషంగా ఉందని, త్వరలోనే ఇటలీ వెళుతున్నానని, పరిస్థితులన్నీ చక్కబడిన తర్వాత మరోసారి భారత్ కు వస్తానని తెలిపాడు. కేరళ తన సొంతిల్లు వంటిదని, ఈ రాష్ట్రం ఎంతో సురక్షితమైనదని అభివర్ణించారు.

కాగా, టొనిజ్జో బెంగళూరు వెళ్లి అక్కడి నుంచి మరికొందరు ఇటలీ జాతీయులతో కలిసి విమానంలో స్వదేశానికి చేరుకుంటారు. ఈ క్రమంలో బెంగళూరు వరకు వెళ్లేందుకు కేరళ ప్రభుత్వమే ఓ వాహనం సమకూర్చనుంది. ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యే సమయంలో అక్కడి సిబ్బంది టొనిజ్జోకు పువ్వులు అందించి శుభాకాంక్షలు తెలియజేశారు.


More Telugu News