మీరు ఆ విధంగా చేసుంటే మీ వ్యాఖ్యలు పట్టించుకునేవాళ్లం కాదు: కన్నా వ్యాఖ్యలపై ఆళ్ల నాని స్పందన

  • దక్షిణ కొరియా నుంచి కరోనా కిట్లు కొనుగోలు చేసిన ఏపీ
  • అధిక ధరలు చెల్లించారంటూ విపక్షాల ఆరోపణలు
  • మీడియా సమావేశంలో బదులిచ్చిన ఆళ్ల నాని
ఏపీలో రాజకీయం అంతా దక్షిణ కొరియా నుంచి కొనుగోలు చేసిన ర్యాపిడ్ టెస్ట్ కిట్ల చుట్టూ తిరుగుతోంది. ఈ కిట్లను అధికధర చెల్లించి కొనుగోలు చేయడంలో ఆంతర్యమేంటని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. నిన్న టీడీపీ నేతలు ఏపీ సర్కారుపై తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించగా, తాజాగా బీజేపీ రాష్ట్ర చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ కూడా ధ్వజమెత్తారు. దీనిపై ఏపీ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని మీడియా సమావేశం నిర్వహించి ఘాటుగా బదులిచ్చారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.. చంద్రబాబునాయుడు కూడా తన మాటలు, చేతల ద్వారా తన రాజకీయ లబ్ది కోసం ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి ప్రవర్తిస్తున్నారని, ఇలాంటి పరిస్థితుల్లో కన్నా, చంద్రబాబుతో కుమ్మక్కై సీఎం జగన్ పై విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

"కన్నా గారూ... ప్రధానికి సైతం కరోనా నివారణ చర్యల గురించి చెప్పింది తానేనంటూ ప్రచారం చేసుకుంటున్న చంద్రబాబుకు ఏనాడైనా హితవు పలికారా? ఒకవేళ మీరు ఎప్పుడైనా చంద్రబాబును ప్రశ్నించి ఉంటే ఇవాళ మీరు చేస్తున్న వ్యాఖ్యలను మేం పట్టించుకునేవాళ్లం కాదు. కానీ కేవలం సీఎం జగన్ నే మీరు లక్ష్యంగా చేసుకోవడంతో మేం స్పందించాల్సి వస్తోంది.

 ఇక ర్యాపిడ్ టెస్టింగ్ కిట్ల గురించి మాపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఒక్కో కిట్ రూ.700 కంటే ఎక్కువ ధరకు కొన్నామని ఆరోపిస్తున్నారు. మరి కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని ఐసీఎంఆర్ ఒక్కో కిట్ కు రూ.795 చొప్పున ఆర్డర్లు ఇచ్చింది వాస్తవం కాదా? మేం ఇంకా ఐసీఎంఆర్ కంటే రూ.65 తక్కువకే కిట్లను కొంటున్నాం. మీరు చిత్తశుద్ధితో వ్యాఖ్యలు చేసినట్టయితే మేం స్పష్టత కోరినప్పుడు మీరెందుకు భుజాలు తడుముకుంటున్నారు?" అంటూ ప్రశ్నించారు.


More Telugu News