వివక్షాపూరిత నిర్ణయాన్ని భారత్ వెంటనే వెనక్కి తీసుకోవాలి: 'ఎఫ్ డీఐ పాలసీ' సవరణపై చైనా

  • విదేశీ పెట్టుబడులకు అనుమతి తప్పనిసరి చేసిన భారత్
  • భారత్ నిర్ణయం డబ్ల్యూటీఓ సిద్ధాంత స్ఫూర్తికి విఘాతమన్న చైనా
  • ఏ దేశం నుంచి పెట్టుబడులు వచ్చినా ఒకేలా చూడాలంటూ స్పష్టీకరణ
చైనా టేకోవర్ల దూకుడుకు అడ్డుకట్ట వేసే లక్ష్యంతో భారత్ ఇటీవల తన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విధానాన్ని సవరించింది. దాని ప్రకారం, భారత్ తో సరిహద్దును పంచుకునే ఏ దేశమైనా భారత్ లో ప్రత్యక్ష పెట్టుబడులు పెట్టాలంటే ముందస్తు అనుమతి తప్పనిసరి. దీనిపై చైనా తీవ్రంగా స్పందించింది. ఏ విధమైన వివక్ష లేని వాణిజ్యం ఉండాలన్న డబ్ల్యూటీఓ సిద్ధాంతాన్ని కాలరాసేలా భారత్ నిర్ణయం ఉందని చైనా విమర్శించింది.

అత్యంత సరళమైన వాణిజ్య విధానాన్ని డబ్ల్యూటీఓ ఆకాంక్షించిందని, కానీ భారత్ అందుకు విఘాతం కలిగించిందని మండిపడింది. స్వేచ్ఛాయుత పెట్టుబడుల వాతావరణం ఉండాలన్న దానిపై జీ20 దేశాలు ఏకాభిప్రాయానికి వచ్చాయని, భారత్ అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని చైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏ దేశం నుంచి పెట్టుబడి వచ్చినా దాన్ని ఒకేలా చూడాలని, ఈ వివక్షాపూరిత నిర్ణయాన్ని భారత్ వెంటనే వెనక్కి తీసుకోవాలని స్పష్టం చేసింది. ఈ మేరకు భారత్ లోని చైనా ఎంబసీ ఓ ప్రకటన విడుదల చేసింది.

కాగా, కరోనా పరిస్థితులను ఆసరాగా చేసుకుని చైనా అనేక దేశాల ఆర్థిక వ్యవస్థల్లో పాగా వేసేందుకు ప్రయత్నిస్తోందని భారత్ బలంగా నమ్ముతోంది. ఇటీవలే హెచ్ డీఎఫ్ సీ లిమిటెడ్ లో తన వాటాను పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా మరింతగా పెంచుకోవడం భారత్ ను ఆందోళనకు గురిచేసింది. ఈ లావాదేవీ జరిగిన కొన్నిరోజుల వ్యవధిలోనే భారత్ తన ఎఫ్ డీఐ (విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు) విధానాన్ని పునర్నిర్వచించింది.


More Telugu News