కమిషన్లకు కక్కుర్తి పడుతున్నారు.. ఇప్పటికీ జగన్ తీరు మారడం లేదు: కేశినేని నాని

  • కరోనా టెస్టింగ్ కిట్లలో అవినీతి చోటుచేసుకుంది
  • ప్రజల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టేశారు
  • కరోనా బాధితుల సంఖ్యను కూడా కచ్చితంగా చెప్పడం లేదు
ఏపీలో కరోనా టెస్టింగ్ కిట్ల కొనుగోలు వ్యవహారం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. కిట్ల కొనుగోలులో కోట్లాది రూపాయల కుంభకోణం జరిగిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించగా... కన్నా రూ. 20 కోట్లకు అమ్ముడుపోయారని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జైల్లో చిప్పకూడు తిన్న విజయసాయికి తనను విమర్శించే నైతికత లేదని... ఆయనపై పరువునష్టం దావా వేస్తానని కన్నా హెచ్చరించారు. ఈ నేపథ్యంలో, వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ ఎంపీ కేశినేని నాని విమర్శలు గుప్పించారు.

కరోనా టెస్టింగ్ కిట్లలో అవినీతి చోటుచేసుకుందని... వైసీపీ ప్రభుత్వం కమిషన్లకు కక్కుర్తి పడిందని కేశినేని నాని మండిపడ్డారు. అధిక ధరలకు టెస్టింగ్ కిట్లను కొనుగోలు చేయడం ద్వారా ప్రజాధనాన్ని డుర్వినియోగం చేశారని విమర్శించారు. కరోనాను ముఖ్యమంత్రి జగన్ చాలా తేలికగా తీసుకున్నారని.... తద్వారా ప్రజల ప్రాణాలను ప్రమాదంలో పడేశారని చెప్పారు. కరోనా బాధితుల సంఖ్యను కూడా కచ్చితంగా వెల్లడించడం లేదని దుయ్యబట్టారు. జగన్ కు ప్రజల రక్షణ కన్నా... రాజకీయాలే ప్రధానమని విమర్శించారు. ఇప్పటికీ జగన్ తన తీరు మార్చుకోవడం లేదని మండిపడ్డారు.


More Telugu News