మందేసి...పోలీసులపై చిందేసి.. బెంగళూరులో నలుగురు యువతుల హల్‌చల్‌!

  • పీకలదాకా తాగేసి రోడ్డుపై విహారం
  • లాక్‌డౌన్‌ పాటించాలన్న పోలీసులపై దౌర్జన్యం
  • కారులో పారిపోయిన వైనం
పూటుగా మద్యం తాగారు...ఒంటిపై తెలివిలేని స్థితిలో కారుతో రోడ్డెక్కారు. లాక్‌డౌన్‌ విధుల్లో ఉన్న పోలీసులు అడ్డుకునే సరికి వారిపైనే చిందులు తొక్కారు. దౌర్జన్యానికి దిగారు. అనంతరం తమ కారుతో పోలీసు వాహనాన్ని డీకొట్టినంత పనిచేసి మరీ పారిపోయారు. ఈ పరిస్థితిని చూసి పోలీసులే ‘వామ్మో...’ అని నోరెళ్ళబెట్టాల్సి వచ్చింది.

బెంగళూరు నగరంలో శనివారం రాత్రి జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలావున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమల్లో ఉన్న విషయం తెలిసిందే. బెంగళూరులో పోలీసులు ఎక్కడికక్కడ చెక్‌ పోస్టులు ఏర్పాటు చేశారు.

కాగా, శనివారం అర్ధరాత్రి నలుగురు యువతులు కారులో రోడ్డెక్కారు. వీరిని లీలాప్యాలెస్‌ చెక్‌ పోస్టు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీన్ని అవమానంగా భావించిన యువతులు తమ వద్ద పాస్‌ ఉందని, పోలీసు ఉన్నతాధికారులు తెలుసంటూ హల్‌చల్‌ చేశారు. వారంతా మద్యం మత్తులో ఉన్నారని గుర్తించిన పోలీసులు వారిని కారులో నుంచి దింపేశారు. బ్రీత్‌ ఎనలైజర్లతో పరీక్షలు చేయాలని ప్రయత్నించారు.

దీంతో వారు మరింత రెచ్చిపోయారు. ‘మమ్మల్నే పరీక్షిస్తారా’ అంటూ పోలీసులను నానా దుర్భాషలాడారు. కారులోకి ఎక్కి దాంతో పోలీసు వాహనాన్నే ఢీకొట్టే ప్రయత్నం చేస్తూ పారిపోయారు. దీంతో పోలీసులు ద్విచక్ర వాహనంతో కారును వెంటాడినప్పటికీ ఫలితం లేకపోయింది. దీంతో కారు నంబరు ఆధారంగా కేసు నమోదు చేసి వారికోసం గాలిస్తున్నారు.


More Telugu News