హైదరాబాద్ లో స్విగ్గీ డెలివరీ బాయ్ కి కరోనా పాజిటివ్!

  • మర్కజ్ కు వెళ్లివచ్చిన బాధితుడి సోదరుడు
  • ఆపై ఒక్క రోజు మాత్రమే డెలివరీలు చేసిన బాధితుడు
  • కుటుంబంలోని ఆరుగురికీ సోకిన కరోనా
ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీలో పార్ట్ టైమర్ గా పని చేస్తున్న ఓ డెలివరీ బాయ్ కి కరోనా సోకింది. ఆ వెంటనే అప్రమత్తమైన అధికారులు, అతన్నుంచి డెలివరీలు తీసుకున్న అందరి ఇళ్లకూ వెళ్లి పరిశీలించారు. ఎవరిలోనూ కరోనా అనుమానిత లక్షణాలు లేవని తేల్చి, అందరినీ జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

ఈ యువకుడి కుటుంబం నాంపల్లి ప్రాంతంలో ఉంటుండగా, అతని పెద్దన్న న్యూఢిల్లీలో జరిగిన మత ప్రార్థనలకు వెళ్లి, మార్చి 19న తిరిగి వచ్చాడు. ఇతని కుటుంబంలో మొత్తం ఆరుగురికి కరోనా సోకిందని, ఈ కుటుంబమంతా మార్చి 22 నుంచి హోమ్ క్వారంటైన్ లోనే ఉందని తెలిపారు. బాధితుడి సోదరుడు న్యూఢిల్లీ నుంచి వచ్చిన తరువాత ఒక్క రోజు మాత్రమే ఆహారాన్ని డెలివరీ బాయ్ సరఫరా చేశాడని, అది జరిగి నెల రోజులు దాటిందని, ఎవరిలోనూ కరోనా లక్షణాలు లేవు కాబట్టి, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు వ్యాఖ్యానించారు.

నాంపల్లిలోని ఇరుకు వీధుల్లో ఇతని కుటుంబం నివసిస్తూందని, ఏప్రిల్ 1న ఇతని సోదరుడికి వైరస్ పాజిటివ్ రావడంతో, కుటుంబం మొత్తాన్నీ ఐసోలేషన్ వార్డుకు తరలించామని నాంపల్లి పోలీసు అధికారి ఒకరు తెలిపారు. అక్కడ జరిపిన పరీక్షల్లో అందరికీ వైరస్ పాజిటివ్ వచ్చిందని అన్నారు.

ఇక తమ డెలివరీ బాయ్ కి కరోనా సోకడంపై స్విగ్గీ స్పందించింది. అతను క్రియాశీలకంగా లేడని, మార్చి 21 తరువాత ఒక్క డెలివరీ కూడా చేయలేదని పేర్కొంది. తమ కస్టమర్ల భద్రత తమకు అత్యంత ప్రాధాన్యతాంశమని, అధికారుల ఆదేశాలను తాము పాటిస్తున్నామని పేర్కొంది.


More Telugu News