వారి సేవలు వెలకట్టలేనివి : చిన్నవర్తకులపై ప్రధాని మోదీ ప్రశంసల జల్లు

  • కరోనా సమస్య ఎదుర్కొంటున్న వేళ తమ బాధ్యత మర్చిపోలేదు
  • ప్రజలకు నిత్యావసరాల సరఫరాలో ప్రాణాలు పణంగా పెట్టి పనిచేశారు
  • లాక్‌డౌన్‌లో ప్రజల సహకారం కూడా మరువలేనిది
దేశంలోని చిన్నవర్తకులపై ప్రధాని మోదీ ప్రశంసల జల్లు కురిపించారు. దేశం కరోనా విపత్తును ఎదుర్కొంటున్న వేళ ప్రాణాలు పణంగా పెట్టి  ప్రజా జీవితంలో తమదైన పాత్రపోషించిన వారి సేవలను అభినందిస్తున్నానని ట్వీట్‌ చేశారు.

‘లాక్‌డౌన్‌తో అన్ని వ్యవస్థలూ స్తంభించిపోయే పరిస్థితి ఎదురైంది. ఈ సమయంలో ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలంటే వారి కనీస అవసరాలు తీరాలి. లేదంటే వారు తప్పనిసరి పరిస్థితుల్లో రోడ్డెక్కుతారు. ఈ పరిస్థితుల్లో ప్రజలకు కావాల్సిన నిత్యావసరాల సరఫరాలో చిన్న వ్యాపారులే కీలకపాత్ర పోషించారు. వారే లేకుంటే...అన్నది ఊహించుకోవడమే సాధ్యం కావడం లేదన్నారు.

వారి సేవలను సమాజం ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది. ‘ఇక, భౌతిక దూరం పాటించడంలో ప్రజల సహకారం మరువలేనిది. షాపుల వద్ద కనీస దూరాన్ని పాటిస్తూ తమకు కావల్సిన వస్తువులు కొనుక్కుని సహకరించారు. భవిష్యత్తులో కూడా ఈ స్ఫూర్తి ఇలాగే కొనసాగాలి’ అని ప్రధాని ట్విట్టర్‌ ద్వారా పిలుపునిచ్చారు.

కాగా ఈరోజు నుంచి లాక్‌డౌన్‌లో కొన్ని సడలింపులు ఉంటాయని, ఆన్‌లైన్‌లో నిత్యావసరేతర వస్తువుల కొనుగోలుకు గ్రీన్‌సిగ్నల్‌ వస్తుందన్న ఆశలపై కేంద్రం నీళ్లు చల్లిన విషయం తెలిసిందే.


More Telugu News