యూరప్ లో కరోనా అప్ డేట్... కొన్ని చోట్ల లాక్ డౌన్ సడలింపు!

  • వన్ మిలియన్ మార్క్ ను తాకిన పాజిటివ్ ల సంఖ్య
  • కొన్ని దేశాల్లో తగ్గిన కొత్త కేసులు
  • పలు చోట్ల లాక్ డౌన్ నిబంధనల సడలింపు
కరోనా మహమ్మారి విజృంభణతో విలవిల్లాడుతున్న యూరప్ లో రెండు విషాదకర మైలురాళ్లు నమోదయ్యాయి. యూరప్ రీజియన్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 10 లక్షలకు చేరిన వేళ, మరణాల సంఖ్య లక్షను తాకింది. అంటే, వ్యాధి సోకిన ప్రతి పది మందిలోనూ ఒకరు మరణించినట్టు.

ఇక యూరప్ లోని పలు దేశాల్లో కరోనా మహమ్మారి వ్యాప్తి ఇంకా అదుపులోకి రాలేదు. స్పెయిన్ లో మాత్రం మరణాల సంఖ్య తగ్గడం కాస్తంత ఊరటను కలిగించే అంశం. ఇక పరిశుభ్రత అధికంగా ఉండే స్విట్జర్లాండ్, డెన్మార్క్, ఫిన్ లాండ్ దేశాల్లో నూతన కేసుల సంఖ్య తగ్గడంతో, లాక్ డౌన్ నిబంధనలను సడలించాలని ప్రభుత్వాలు భావిస్తున్నాయి. ఈ వారంలోనే షాప్స్, పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.

యూఎస్, ఇటలీల తరువాత అత్యధిక మరణాలు... అంటే దాదాపు 20,500 మంది చనిపోయిన స్పెయిన్ లో శనివారం నాడు 565 మంది మరణించగా, ఆదివారం నాటికి ఆ సంఖ్య 410కి తగ్గింది. ఈ సంఖ్యలే తమకు భవిష్యత్ పై ఆశలు కలిగిస్తున్నాయని ఆ దేశ ఆరోగ్య శాఖ అత్యవసర పరిస్థితుల సమన్వయకర్త ఫెన్రాండో సిమాన్ వ్యాఖ్యానించారు. గడచిన నాలుగు వారాల్లోనే రోజువారీ మరణాల్లో ఇదే అత్యల్పమని ఆయన అన్నారు.

ఇక, 3,400 మరణాలు సంభవించిన జర్మనీ, కరోనాను నియంత్రణలోకి తెచ్చామని ప్రకటించింది. రెండోసారి మహమ్మారి విజృంభించకుండా చర్యలు తీసుకుంటూనే, కొన్ని నిబంధనలను సడలిస్తామని అధికారులు వ్యాఖ్యానించారు. సోమవారం నుంచి కొన్ని షాపులను తెరచుకునేందుకు అనుమతిస్తామని స్పష్టం చేశారు. ఇదే సమయంలో ఇటలీలోని కొన్ని ప్రాంతాల్లో లాక్ డౌన్ ను సడలించడంతో, ప్రజలు బయటకు వచ్చారు. వెనిస్ వీధుల్లోని కాలువల్లో జన సంచారం మొదలైంది. బ్రిటన్ లో మాత్రం లాక్ డౌన్ సడలింపుపై ఇంకా ఎటువంటి నిర్ణయమూ తీసుకోలేదు. ఇప్పటికిప్పుడు పరిస్థితిని పూర్వ స్థాయికి తీసుకురాలేమని అధికారులు అంటున్నారు.

యూకేలో 16,060 మంది మరణించడం, ఇంకా వేలాది మంది ఆసుపత్రుల్లోనే చికిత్స పొందుతూ ఉండటంతో, ఏ నిర్ణయమైనా పూర్తిగా సమీక్షించిన తరువాతనే తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.


More Telugu News