పారిస్ నదీ జలాల్లో స్వల్పంగా కరోనా వైరస్ జాడలు!

  • తాగే నీరు కలుషితం కాలేదు
  • సీన్ నది, ఓర్క్ కెనాల్ నీటిలోనే వైరస్
  • ఆ నీటి వాడకాన్ని నిలిపివేశామన్న అధికారులు
 తాగడానికి కాకుండా ఇతర అవసరాలకు వినియోగించే నీటిలో కరోనా వైరస్ ను స్వల్ప స్థాయిలో కనుగొన్నామని ఫ్రాన్స్ ప్రకటించింది. వీధులను శుభ్రపరిచే నిమిత్తం వినియోగిస్తున్న నీటిలో కరోనా జాడ కనిపించిందని, అయితే, తాగే నీరు కలుషితం అవుతుందన్న ఆందోళన అవసరం లేదని అధికారులు వెల్లడించారు.

పారిస్ వ్యాప్తంగా 27 ప్రాంతాల నుంచి నీటిని సేకరించిన వాటర్ అథారిటీ, నమూనాలను పరీక్షించగా, నాలుగు ప్రాంతాల నుంచి తెచ్చిన నీటిలో స్వల్ప మోతాదులో కరోనా వైరస్ కనిపించింది. ఆ వెంటనే ముందు జాగ్రత్త చర్యగా ఆ నీటిని ఎటువంటి అవసరాలకూ వాడరాదని ఆదేశించినట్టు నగర అధికారి సిలియా బ్లాయూల్ వెల్లడించారు.

నగర వాసుల తాగునీటి అవసరాల నిమిత్తం సరఫరా చేస్తున్న నీరు పూర్తిగా స్వతంత్ర నెట్ వర్క్ నుంచి వస్తున్నదని, ఆ నీటిని నిరభ్యంతరంగా తాగవచ్చని పారిస్ పర్యావరణ శాఖ అధికారి ఒకరు వెల్లడించారు. పారిస్ మీదుగా పయనించే సీన్ నది, ఓర్క్ కెనాల్ లోని నీటిలో మాత్రమే వైరస్ జాడలు వున్నాయని, అక్కడి నుంచే నగరంలోని ఉద్యానవనాలకు, వాటర్ ఫౌంటెన్ లకు నీరందిస్తున్నామని, ప్రస్తుతం అక్కడికి ప్రజలను అనుమతించడం లేదని అధికారులు స్పష్టం చేశారు.


More Telugu News