మద్యం తరలిస్తూ పట్టుబడిన హోంగార్డు, కానిస్టేబుల్

  • హోంగార్డు నుంచి 36 మద్యం బాటిళ్ల పట్టివేత
  • కానిస్టేబుల్ నుంచి 23 సీసాలు స్వాధీనం
  • ఇద్దరినీ రిమాండ్‌కు పంపిన పోలీసులు
లాక్‌డౌన్ వేళ మద్యాన్ని అక్రమంగా తరలిస్తూ ఓ హోంగార్డు, మరో కానిస్టేబుల్ పట్టుబడ్డారు. హైదరాబాద్‌లో రెండు వేర్వేరు ఘటనల్లో పోలీసులు వీరిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. వనస్థలిపురం పోలీసుల కథనం ప్రకారం.. సూర్యాపేట జిల్లా నమ్మికల్ గ్రామానికి చెందిన అనిల్‌కుమార్.. మలక్‌పేట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో హోంగార్డు‌గా పనిచేస్తున్నాడు.

నిన్న స్వగ్రామం నమ్మికల్ నుంచి కారులో మద్యం బాటిళ్లు తీసుకుని సైదాబాద్ బయలుదేరాడు. అనుమానం రాకుండా యూనిఫాం కూడా ధరించాడు. అయితే, అతడి కారులో మద్యం సీసాలు ఉన్నట్టు సమాచారం అందుకున్న పోలీసులు వనస్థలిపురం పనామా వద్ద కారు ఆపి తనిఖీ చేసి 36 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. అనిల్‌కుమార్‌ను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.

మరో ఘటనలో నాంపల్లిలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న విజయ్ (30) ఈ నెల 17న పిడుగురాళ్ల నుంచి నగరానికి కారులో వస్తూ మార్గమధ్యంలో నల్గొండ వద్ద మద్యం సీసాలు కొనుగోలు చేశాడు. వాటితో నగరానికి వస్తుండగా వనస్థలిపురం పనామా వద్ద పోలీసులు తనిఖీ చేసి 23 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


More Telugu News