కరోనా నుంచి కోలుకున్న ఆనందం ఆవిరి.. మళ్లీ సోకిన మహమ్మారి

  • హిమాచల్ ప్రదేశ్‌లోని ఉనా జిల్లాలో ఘటన
  • ముగ్గురు కోలుకోగా మళ్లీ ఒకరికి సోకిన వైనం
  • రాష్ట్రంలో 23కు పెరిగిన యాక్టివ్ కేసుల సంఖ్య
కరోనా వైరస్ నుంచి కోలుకున్న ఆనందంలో ఉన్న వ్యక్తికి ఆ సంతోషం ఎంతోకాలం నిలవలేదు. తాజాగా మళ్లీ సోకినట్టు తేలడంతో నిర్ఘాంతపోయాడు. హిమాచల్‌ప్రదేశ్‌లో జరిగిందీ ఘటన. తాజా కేసుతో కలుపుకుని రాష్ట్రంలో నమోదైన మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 23కు పెరిగినట్టు అధికారులు తెలిపారు. అలాగే, మరో వ్యక్తి కూడా వైరస్ బారినపడడంతో మొత్తం కేసుల సంఖ్య 40కి పెరిగింది. ఉనా జిల్లాకు చెందిన కరోనా రోగి ఒకరు ఇటీవల కోలుకుని డిశ్చార్జ్ అయ్యాడు. జిల్లాకు చెందిన ముగ్గురు వ్యక్తులు కరోనా నుంచి కోలుకోగా, వారిలో ఒకరు మళ్లీ వైరస్ బారినపడినట్టు అధికారులు తెలిపారు. అయితే, ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

వైద్య ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం.. ఉన్నా జిల్లాలో మొత్తం 16 కరోనా నిర్ధారిత కేసులు నమోదు కాగా, ఇద్దరు కోలుకున్నారు. మరో 14 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.  అలాగే, చంబా, కంగ్రా, సోలన్ జిల్లాలో ముగ్గురు చొప్పున, ఉనా జిల్లాలో ఇద్దరు వైరస్ నుంచి కోలుకున్నట్టు వైద్యాధికారులు తెలిపారు. తాజాగా ఉనాలో వెలుగు చూసిన కేసులో ఒకటి తబ్లిగీ జమాత్‌తో సంబంధం ఉన్నదేనని ఉనా డిప్యూటీ కమిషనర్ సందీప్ కుమార్ తెలిపారు. కాగా, రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా బారినపడి ఇద్దరు మృతి చెందారు.


More Telugu News