అన్ని రకాల విద్యుత్ స్కూటర్లపై ప్రత్యేక ఆన్‌ లైన్ ఆఫర్‌: హీరో ఎలక్ట్రిక్

  • ఏప్రిల్ 17 నుంచి మే 15 వరకూ ఆఫర్
  • రూ. 5 వేల వరకూ రాయితీ
  • రిఫరెన్స్ కొనుగోళ్లపై రూ. 1000 లాభం
  • వెల్లడించిన హీరో ఎలక్ట్రిక్ సీఈఓ
ఇండియాలో అత్యధికంగా విద్యుత్ వాహనాలను విక్రయిస్తున్నహీరో ఎలక్ట్రిక్, ప్రత్యేక ఆన్‌ లైన్ అమ్మకాల స్కీమ్ ను ప్రకటించింది. మే 15 వరకూ అమలులో ఉండే ఈ స్కీమ్ లో భాగంగా సంస్థ అందించే అన్ని రకాల విద్యుత్ వాహనాలపై రూ. 5 వేల రాయితీ లభిస్తుంది. గ్లైడ్ లేదా ఈ-సైకిల్ కొనుగోళ్లపై రూ. 3 వేల నగదు, రిఫరెన్స్ కొనుగోలుపై రూ. 1000 నగదును అందిస్తామని సంస్థ సీఈఓ సోహిందర్ గిల్ ఓ ప్రకటనలో తెలిపారు.

ఎంచుకున్న మోడల్‌ తో సంబంధం లేకుండా రూ. 2,999 డబ్బు ఆన్ లైన్ లో చెల్లించి వాహనాన్ని బుకింగ్ చేసుకోవచ్చని, జాతీయ లాక్‌ డౌన్‌ జూన్‌ నెలలోనూ కొనసాగితే మాత్రం ఈ డబ్బును వెనక్కు తిరిగి ఇస్తామని, లాక్ డౌన్ ను ఎత్తేస్తే, జూన్ నెలాఖరు లోపు మిగతా డబ్బు చెల్లించి, తమ వాహనాలను వినియోగదారులు డెలివరీ తీసుకోవాల్సి ఉంటుందని గిల్ వెల్లడించారు.

కాగా, హీరో ఎలక్ట్రిక్ మోడల్స్‌ లో ప్రస్తుతం ఫ్లాష్, ఎన్‌వైఎక్స్, ఆప్టిమా, ఫోటాన్, ఫ్లాష్, డాష్ మరియు ఈఆర్ (ఎక్స్‌టెండెడ్ శ్రేణి) వేరియంట్లతో పాటు గ్లైడ్ మరియు ఈ-సైకిల్ ఉన్నాయి. ఇవన్నీ లిథియం-అయాన్ బ్యాటరీలతో నడుస్తాయి.

"ప్రజల జీవితాలపై కరోనా వంటి వైరస్ ఎంతటి ప్రభావాన్ని చూపగలదో ఇప్పటికే తెలిసొచ్చింది. గాలి కాలుష్యం వల్ల ఇబ్బంది పడుతున్న ఊపిరితిత్తులు ఈ వైరస్ కారణంగా మరింతగా నష్టపోయాయి. ఇదే సమయంలో లాక్ డౌన్ తో కాలుష్య కారకాలైన వాహనాలు రోడ్లపై తిరగక పోవడం వల్ల ఆహ్లాదకరమైన వాతావరణం కనిపిస్తోంది. ప్రకృతి మరలా తన సహజత్వాన్ని చూపుతొంది. వినియోగదారులు ఇప్పుడు స్వచ్ఛమైన రవాణా వైపు మళ్లాల్సిన ధోరణి ఉందని నేను గట్టిగా నమ్ముతున్నాను. అందుకే ఆకర్షణీయమైన ఆన్‌ లైన్ ఆఫర్‌ ను అందిస్తున్నాం" అని సోహిందర్ గిల్ వ్యాఖ్యానించారు. 


More Telugu News