ఇండియా మాత్రమే కాదు... తబ్లిగీ జమాత్ బాధిత దేశాల్లో పాకిస్థాన్, మలేషియా!

  • దక్షిణాసియా దేశాలపై మత ప్రార్థనల కారణంగానే కేసులు అధికం
  • బాధిత దేశాల్లో ఇండొనేషియా కూడా
  • ఢిల్లీతో పాటు తమిళనాడు, తెలంగాణల్లో తబ్లిగీ ప్రభావం అధికం
  • వెల్లడించిన కేంద్ర ఆరోగ్య శాఖ
ఇండియాలో నమోదైన 14 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసుల్లో దాదాపు 4,300 కేసులు న్యూఢిల్లీలోని మర్కజ్ లో జరిగిన తబ్లిగీ జమాత్ మత ప్రార్థనల కారణంగా వచ్చినవేనని కేంద్రం స్పష్టం చేస్తున్న వేళ, తబ్లిగీ బాధిత దేశం ఇండియా ఒక్కటే కాదని, పాకిస్థాన్, మలేషియాల్లో సైతం మత ప్రార్థనల వల్ల కరోనా వ్యాప్తి జరిగిందని తెలుస్తోంది. ముఖ్యంగా దక్షిణాసియా దేశాల్లో తబ్లిగీ జమాత్ ప్రభావం అధికంగా కనిపిస్తోంది.

కౌలాలంపూర్ శివార్లలో ఉన్న ఓ మసీదు కాంప్లెక్స్ లో ఫిబ్రవరిలో జరిగిన  తబ్లిగీ జమాత్ వార్షిక సమ్మేళనానికి వివిధ దేశాలకు చెందిన 15 వేల మందికి పైగా హాజరయ్యారు. వారిలో కొందరు భారతదేశానికి వచ్చినట్లు భావిస్తున్నారు. ఆ  దేశంలో 3,500 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 1,500 కేసులు ఈ ప్రార్థనలతో సంబంధమున్నవేనని  అంటున్నారు.

ఇక పాకిస్తాన్  విషయానికి వస్తే,  రావల్పిండి ఇతేమాలో మార్చిలో జరిగిన వార్షిక సమావేశానికి దాదాపు లక్ష మంది వచ్చారు. వీరిలో పలువురు విదేశీయులు కూడా ఉండగా, దేశంలో నమోదైన 7,500 కేసుల్లో 500 పైగా కేసులు, ఈ ప్రార్థనలతో సంబంధం ఉన్నవే.

కాగా, ఇండియాలో మత ప్రార్థనలకు, కరోనాకు ఉన్న లింక్ ను తొలుత గుర్తించింది తెలంగాణ రాష్ట్రమే. ఢిల్లీకి వెళ్లి వచ్చిన ఆరుగురికి రాష్ట్రంలో కరోనా పాజిటివ్ రావడంతో, మొట్టమొదటి సారిగా ప్రమాద ఘంటికలు మోగాయి. ఢిల్లీలో జరిగిన ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారిని, వారితో కాంటాక్ట్ అయిన వారిని గుర్తించి క్వారంటైన్ సెంటర్ కు పంపే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టినా, ఇప్పటికీ ట్రేస్ కానివారున్నారని అధికారులు అంటుండటం ఆందోళన కలిగిస్తోంది.

ఇక దేశ రాజధానిలో నమోదైన కేసుల్లో 63 శాతం తబ్లిగీతో లింక్ ఉన్న కేసులేనని, తమిళనాడులో 84 శాతం, తెలంగాణలో 79 శాతం కేసులు ఈ కారణంగా వచ్చినవేనని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. అరుణాచల్ ప్రదేశ్ లో వచ్చిన ఒకే కేసు కూడా మత ప్రార్థనల కారణంగా వచ్చినదేనని, దేశంలోని 23 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ తరహా కేసులు ఉన్నాయని వెల్లడించింది.


More Telugu News