ప్రింట్ మీడియాకు ఊరటనిస్తూనే కీలక నిర్ణయం తీసుకున్న ‘మహా’ ప్రభుత్వం

  • ఈ నెల 20 నుంచి ప్రింట్ మీడియాకు లాక్‌డౌన్ నుంచి మినహాయింపు
  • దినపత్రికలను ఇంటింటికీ వెళ్లి పంచకూడదన్న ప్రభుత్వం
  • పది శాతం మందితో కార్యకలాపాలు ప్రారంభించాలంటూ అధికారులకు ఆదేశం
రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం దినపత్రికల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 20 నుంచి ప్రింట్ మీడియాకు లాక్‌డౌన్ నుంచి మినహాయింపు ఇస్తున్నట్టు నిన్న పేర్కొంది. అయితే, దినపత్రికలు, మ్యాగజైన్లను ఇంటింటికి వెళ్లి డోర్ డెలివరీ చేయడంపై మాత్రం నిషేధం విధిస్తున్నట్టు స్పష్టం చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే, అన్ని డిపార్ట్‌మెంట్ల కమిషనరేట్ల కమిషనర్లు, డైరెక్టరేట్ల డైరెక్టర్లు తమ సిబ్బందిలో పది శాతం మందితో కార్యాలయానికి హాజరు కావాలని ఆదేశించింది.

ఈ నెల 20 నుంచి హాట్‌స్పాట్ కాని ప్రాంతాల్లో అనుమతించే కార్యకలాపాలకు సంబంధించి ప్రభుత్వం శుక్రవారం ఓ జాబితాను విడుదల చేసింది. ఇందులో ఆరోగ్యం, వ్యవసాయం తదితరాలు కూడా ఉన్నాయి. లాక్‌డౌన్ నేపథ్యంలో ఈ నెల 20 నుంచి అమలు చేయాల్సిన సడలింపులకు సంబంధించిన మార్గదర్శకాలను కేంద్రం ఇటీవల విడుదల చేసిన నేపథ్యంలో తాజాగా మహా ప్రభుత్వం ఈ ఆదేశాలు జారీ చేసింది.


More Telugu News