కరోనా తగ్గిన తర్వాత అన్ని దేశాలు చైనాను ఫాలో కావాలి!: కరోనా లెక్కలపై డబ్ల్యూహెచ్‌వో

  • మృతులు, బాధితుల సంఖ్యను పెంచి చూపిన చైనా
  • కరోనా విజృంభణ నేపథ్యంలో చికిత్సపైనే దృష్టి పెట్టిందన్న డబ్ల్యూహెచ్‌వో
  • అన్ని దేశాలు తిరిగి కరోనాపై కచ్చితమైన డేటా అందించాలని సూచన
  • ఆఫ్రికాలో పెరుగుతున్న కరోనా కేసులపై ఆందోళన
కరోనా వైరస్‌ మృతులు, బాధితుల విషయంలో మొదట చైనా తెలిపిన వివరాలపై ప్రపంచం అనుమానాలు వ్యక్తం చేస్తున్న వేళ.. ఆ దేశం ఆ లెక్కలను సవరించిన విషయం తెలిసిందే.  వుహాన్‌లో తాము మొదట చెప్పిన దాని కంటే 1,290 మంది అధికంగా చనిపోయారని చైనా తెలిపింది.

సవరించిన డేటాను విడుదల చేసింది. అక్కడి మృతుల సంఖ్యను సుమారు 50 శాతం పెంచి చూపించింది. కొత్తగా నమోదైన కేసుల సంఖ్యను కూడా 325 పెంచి చూపడం గమనార్హం. దీనిపై స్పందించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో).. కరోనా విజృంభణ నేపథ్యంలో అన్ని దేశాలు గణాంకాలను సరిగ్గా లెక్కగట్టలేకపోతుండొచ్చని అభిప్రాయపడింది.

అయితే, కరోనా తగ్గిన తర్వాత చైనాను ఫాలో అవుతూ మరోసారి కరోనా బాధితుల గురించి సవరించిన డేటాను విడుదల చేయాలని చెప్పింది. చైనాలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో గణాంకాల నమోదులో తప్పిదాలు జరిగి ఉండచ్చని తెలిపింది.

జెనీవాలో డబ్ల్యూహెచ్‌వో కొవిడ్‌-19 ప్రత్యేక ప్రతినిధి మారియా వాన్ కెర్ఖోవె తాజాగా మాట్లాడుతూ... 'కరోనా విజృంభిస్తోన్న నేపథ్యంలో దేశాల్లో మరణాలు, కేసుల సంఖ్యను కచ్చితంగా లెక్కగట్టడం ఓ సవాలే. ప్రపంచంలోని అన్ని దేశాలు ఇదే విధమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నాయని నేను భావిస్తున్నాను. తిరిగి అన్ని దేశాలు కరోనా బాధితులపై సమీక్ష జరిపి రికార్డులను సవరించుకోవాలి' అని చెప్పారు.

వుహాన్‌ అధికారులు ఇలాగే, తిరిగి సమీక్ష జరిపి అన్ని ఆసుపత్రుల నుంచి కచ్చితమైన గణాంకాలు సేకరించి మళ్లీ డేటాను సరి చేసుకున్నారని తెలిపారు. వుహాన్‌లో కొందరు ఇళ్లలోనే మృతి చెందారని, మరికొందరు తాత్కాలిక క్వారంటైన్‌ వంటి శిబిరాల్లో మృతి చెందారని ఆమె అన్నారు.

ఈ నేపథ్యంలో ఆసుపత్రుల్లో కచ్చితమైన లెక్కలు వేసుకునే వీలు లేకుండా పోయుండొచ్చని అభిప్రాయపడ్డారు. ఆసుపత్రుల్లో కరోనా బాధితులకు చికిత్స అందించడంలోనే వైద్యులు నిమగ్నమై ఉండడంతో ఈ పరిస్థితి వచ్చిందన్నారు. అన్ని దేశాలు కచ్చితమైన డేటాను వీలైనంత త్వరగా ఇస్తే బాగుంటుందని కోరారు. కాగా, అమెరికాతో పాటు యూరప్ దేశాల్లో కరోనా మరణాల సంఖ్య అత్యధికంగా ఉంది. ఆఫ్రికాలో కరోనా కేసులు పెరిగిపోతున్న విషయంపై డబ్ల్యూహెచ్‌వో ఆందోళన వ్యక్తం చేసింది.


More Telugu News