సోమవారం నుంచి వెసులుబాటు.. బెంగళూరు ఐటీ, బీటీ కంపెనీల ప్రతినిధులతో ప్రభుత్వం చర్చలు!

  • సోమవారం నుంచి 50 శాతం మంది ఉద్యోగులతో పని చేయవచ్చన్న కేంద్రం
  • కంపెనీల అధినేతలతో కర్ణాటక డిప్యూటీ సీఎం భేటీ
  • ఫేజ్-1లో 15 శాతం మంది ఉద్యోగులే చాలన్న కిరణ్ మజుందార్ షా
సోమవారం (ఏప్రిల్ 20) నుంచి  ఐటీ, ఐటీఈఎస్ కంపెనీలు తమ కార్యకలాపాలను ప్రారంభించుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అయితే స్టాఫ్ మొత్తాన్ని కంపెనీకి పిలవరాదని... 50 శాతం మంది ఉద్యోగులతో మాత్రమే పని చేయాలని షరతు విధించింది. ఈ నేపథ్యంలో బెంగళూరులోని ఐటీ, ఐటీఈఎస్, బీటీ (బయోటెక్నాలజీ) సంస్థల అధినేతలతో కర్ణాటక డిప్యూటీ సీఎం నారాయణ సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇప్పటికిప్పుడే 50 శాతం వర్క్ ఫోర్స్ ను వినియోగించడం సంస్థలకు సాధ్యపడకపోవచ్చని... దీనికి కొన్ని వారాల సమయం పట్టొచ్చని అన్నారు. ఈ సందర్భంగా బయోకాన్ ఎండీ కిరణ్ మజుందార్ షా మాట్లాడుతూ, పోలీసులు ఇచ్చిన ఎస్సెన్షియల్ పాసులు మంచి ఫలితాలను ఇచ్చాయని చెప్పారు. లాక్ డౌన్ నిబంధనలను సడలిస్తున్న నేపథ్యంలో, పాసుల సంఖ్యను పెంచాలని కోరారు.

ఇదే సమయంలో ఎక్కువ సంఖ్యలో ప్రైవేట్ వాహనాలను అనుమతించరాదని చెప్పారు. సైట్లో ఉద్యోగులు పనిచేయాలని కోరుకునే సంస్థలు... ప్రభుత్వ సిటీ బస్సులను ఉపయోగించుకోవాలని సూచించారు. క్యాంపస్ లలో కరోనా టెస్టింగ్ బూత్ లు ఉండాలని... ఎవరికైనా పాజిటివ్ అని తేలితే, అన్ని నిబంధనలను కచ్చితంగా పాటించాలని చెప్పారు.

ఈ తరుణంలో నారాయణ స్పందిస్తూ, కంపెనీలో ఎవరికైనా పాజిటివ్ అని తేలితే... కంపెనీని షట్ డౌన్ చేయాలా? శానిటైజ్ చేయాలా? స్క్రీనింగ్ చేయాలా? అనే విషయంపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఉద్యోగులను తొలగించే ఆలోచన ఏ కంపెనీ కూడా చేయవద్దని కోరారు.

ఈ సందర్బంగా కిరణ్ మజుందార్ షా మాట్లాడుతూ, ఉద్యోగుల ఆరోగ్య రక్షణే అన్ని కంపెనీలకు ప్రధానమని చెప్పారు. నాస్కామ్ తరపున ఒక ప్రణాళికను వెల్లడిస్తున్నామని... ఫేజ్-1లో 10 నుంచి 15 శాతం ఉద్యోగులను మాత్రమే అనుమతించాలని... రాబోయే  2, 3 నెలల్లో వర్క్ ఫోర్స్ ను 50 శాతానికి పెంచుకోవచ్చని చెప్పారు.

ఈ గ్యాప్ లో సంస్థల్లోని వర్క్ ప్లేస్ ను సురక్షితంగా తయారు చేసుకోవడానికి తమకు సమయం దొరుకుతుందని అన్నారు. మే 3 తర్వాత దేశంలో సాధారణ స్థితి నెలకొంటుందని చాలా మంది భావిస్తున్నారని...  అది ఎంత మాత్రం జరిగే పని కాదని చెప్పారు. కరోనా వైరస్ ను ఎలా మేనేజ్ చేయాలి? మనం ఎలా జీవించాలి? అనే విషయాలను ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలని చెప్పారు.


More Telugu News