ఎట్టకేలకు దిగొచ్చిన తబ్లిగీ జమాత్ చీఫ్.. ఢిల్లీ పోలీసులకు లేఖ!

  • పోలీసు విచారణకు సిద్ధంగా ఉన్నా
  • మీరిచ్చిన రెండు నోటీసులకు స్పందించా
  • నేను విచారణకు సహకరిస్తున్నట్టే లెక్క
ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రార్థనలకు హాజరై తిరిగి వచ్చిన వారి వల్ల దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు అమాంతం పెరిగిపోయిన సంగతి తెలిసిందే. తబ్లిగీ జమాతే సంస్థ నిర్వహించిన ఈ ప్రార్థనలకు మన దేశం నుంచే కాకుండా విదేశాల నుంచి సైతం భారీ సంఖ్యలో హాజరయ్యారు.

ఈ నేపథ్యంలో కరోనా విస్తరిస్తున్న సమయంలో వేలాది మందిని మర్కజ్ లో ఉంచి, మహమ్మారి విస్తరణకు కారణమయ్యారనే ఆరోపణలతో తబ్లిగీ జమాతే చీఫ్ మౌలానా సాద్ ఖందాల్వీపై పోలీసులు కేసు నమోదు చేశారు. అంతేకాదు చట్ట విరుద్దంగా ఆయన సంస్థకు విదేశాల నుంచి నిధులు వచ్చాయేమో అనే కోణంలో విచారించడానికి ఈడీ కూడా రంగంలోకి దిగింది.

అయితే పోలీసుల ముందుకు రాకుండా ఖందాల్వీ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆయన కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో ఖందాల్వీ ఎట్టకేలకు దిగొచ్చారు. విచారణకు సహకరించేందుకు తాను సిద్ధంగా ఉన్నానంటూ ఢిల్లీ పోలీసులకు లేఖ రాశారు.

'సీఆర్పీసీ 91 కింద ఏప్రిల్ 1, 2 తేదీల్లో ఇచ్చిన రెండు నోటీసులకు నేను స్పందించాను. తద్వారా విచారణకు నేను సహకరిస్తున్నట్టే లెక్క' అని తన లేఖలో ఆయన పేర్కొన్నారు. మీరు జరుపుతున్న విచారణకు సహకరించేందుకు తాను ఎల్లవేళలా సిద్ధమనే విషయాన్ని మరోసారి చెపుతున్నానని తెలిపారు.


More Telugu News