తైవాన్ ఆరోగ్యశాఖ నుంచి గత డిసెంబర్లోనే ఈమెయిల్ వస్తే డబ్ల్యూహెచ్ఓ ఎందుకు పట్టించుకోలేదు?: ట్రంప్

  • డబ్ల్యూహెచ్ఓపై నిప్పులు కురిపిస్తున్న ట్రంప్
  • వార్షిక నిధుల నిలిపివేత
  • తాజాగా ట్విట్టర్ లో ప్రశ్నాస్త్రాలు
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ)కు ప్రతి ఏటా ఇచ్చే నిధులను నిలిపివేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ లో ఆగ్రహం ఇంకా చల్లారలేదు. కరోనా వైరస్ వ్యాప్తి అంశంలో వాస్తవాలు దాచిన చైనాకు వంతపాడిందంటూ ఆయన డబ్ల్యూహెచ్ఓపై కారాలుమిరియాలు నూరుతున్నారు. తాజాగా, మరోసారి విరుచుకుపడ్డారు. ప్రజల మధ్య ప్రమాదకర రీతిలో కరోనా వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉందని తైవాన్ ఆరోగ్యశాఖ నుంచి వచ్చిన ఈమెయిల్ ను డబ్ల్యూహెచ్ఓ ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. తైవాన్ నుంచి గత డిసెంబరులోనే ఈమెయిల్ వస్తే నిర్లక్ష్యంగా వ్యవహరించడంలో ఆంతర్యం ఏంటని నిలదీశారు.

కరోనా వైరస్ విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ అనేక ప్రకటనలు చేసిందని, అవన్నీ తప్పుల తడకలు, తప్పుదారి పట్టించేవిగానే ఉన్నాయని, ఇలా ఎందుకు చేయాల్సి వచ్చిందంటూ మండిపడ్డారు. ఈ మేరకు ట్రంప్ ట్వీట్ చేశారు. జనవరి, ఫిబ్రవరిలో వైరస్ శరవేగంగా విస్తరిస్తుంటే నిర్ణయాత్మక ప్రకటన చేసేందుకు డబ్ల్యూహెచ్ఓ ఎందుకంత సమయం తీసుకోవాల్సి వచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు.


More Telugu News