ఐపీఎల్ ఆతిథ్యానికి శ్రీలంక ఆసక్తి.... ప్రతిపాదనేమీ రాలేదన్న బీసీసీఐ

  • కరోనా ప్రభావంతో ఐపీఎల్ నిరవధిక వాయిదా
  • ఐపీఎల్ ఆతిథ్యానికి సిద్ధంగా ఉన్నామన్న లంక బోర్డు
  • నిర్ణయం తీసుకునే స్థితిలో లేమన్న బీసీసీఐ
  • ప్రతిపాదన వచ్చినా చర్చించగలమన్న నమ్మకం లేదని వెల్లడి
కరోనా మహమ్మారి ప్రభావంతో ఐపీఎల్ ను నిరవధికంగా వాయిదా వేసిన సంగతి తెలిసిందే. అయితే, తమ దేశంలో కరోనా ప్రభావం పెద్దగా లేదని, బీసీసీఐ అంగీకరిస్తే ఐపీఎల్ కు తాము ఆతిథ్యమిస్తామంటూ శ్రీలంక క్రికెట్ బోర్డు పేర్కొంది. దీనిపై బీసీసీఐ స్పందించింది.

శ్రీలంక క్రికెట్ వర్గాల నుంచి ఐపీఎల్ నిర్వహణపై తమకేమీ ప్రతిపాదన రాలేదని వెల్లడించింది. ప్రపంచమంతా కరోనా కారణంగా స్థంభించిపోయిన నేపథ్యంలో ఐపీఎల్ పై నిర్ణయం తీసుకునే స్థితిలో బీసీసీఐ లేదని ఓ అధికారి తెలిపారు. ఒకవేళ ప్రతిపాదన వచ్చినా దానిపై అర్థవంతమైన చర్చ జరుగుతుందన్న నమ్మకం కూడా లేదని పేర్కొన్నారు. కాగా, అప్పట్లో రెండు పర్యాయాలు ఐపీఎల్ పోటీలు విదేశాల్లో జరిగాయి. 2009లో దక్షిణాఫ్రికాలో, 2014లో పాక్షికంగా యూఏఈలో ఐపీఎల్ నిర్వహించారు. భారత్ లో ఎన్నికల కారణంగా ఆ నిర్ణయం తీసుకున్నారు.


More Telugu News