ఎవరైనా కరోనాను ఓడించగలిగితే అది మా నాన్నే అవ్వాలని అనుకున్నా: ప్రిన్స్ విలియం

  • బ్రిటన్ లో కరోనా విలయం
  • ప్రిన్స్ చార్లెస్ కు తొలినాళ్లలోనే సోకిన మహమ్మారి
  • వారం రోజుల్లో కోలుకున్న 71 ఏళ్ల యువరాజు
కరోనా వైరస్ భూతం బ్రిటన్ లో అడుగుపెట్టిన తొలినాళ్లలోనే ప్రిన్స్ చార్లెస్ కు సోకింది. దాంతో 71 సంవత్సరాల చార్లెస్ క్వారంటైన్ లోకి వెళ్లక తప్పలేదు. అయితే అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తూ ఆయన వారం రోజుల్లోనే కోలుకున్నారు. దీనిపై ఆయన తనయుడు ప్రిన్స్ విలియం స్పందించారు.

"మా నాన్నకు కరోనా సోకిందనగానే కొంచెం ఆందోళనకు గురయ్యాను. ఆయన వయసు రీత్యా కరోనా సోకడం ఎంతో ప్రమాదకరం. పైగా ఆయనకు అనేక రకాల ఛాతీ ఇన్ఫెక్షన్లు ఉన్నాయి. ఏళ్ల తరబడి జలుబు వంటి వాటితో బాధపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కరోనా మహమ్మారి నుంచి బయటపడడం అసాధ్యం. అందుకే ఎవరైనా కరోనాను జయించగలిగితే అది మా నాన్నే అవ్వాలని కోరుకున్నాను" అంటూ వివరించారు.

బ్రిటన్ లో కరోనా వైరస్ ప్రబలడంతో రాజకుటుంబీలను ప్రత్యేక ప్రాంతాలకు తరలించారు. బ్రిటన్ మహారాణి ఎలిజబెత్-2 (93), ఆమె భర్త ప్రిన్స్ ఫిలిప్ (98) లండన్ సమీపంలోని విండ్సర్ కోటలో విశ్రాంతి తీసుకుంటున్నారు.


More Telugu News