కేసీఆర్! నిన్ను నాయనా అని పిలవనా?... నటుడు ఉత్తేజ్ భావోద్వేగ వీడియో ఇదిగో!

  • ప్రజల వెన్నంటి నిలిచి కన్నీరు తుడుస్తున్న కేసీఆర్
  • కేసీఆర్ ప్రసంగాలు వింటుంటే పానాలు లేచి వచ్చినయ్
  • బ్రతుకు మీద నమ్మకాన్ని పెంచుతున్నారు
  • తెలంగాణ ముఖ్యమంత్రిపై ఉత్తేజ్ ప్రశంసల వర్షం
"ప్రపంచ మానవాళిని, మానవ మనుగడని, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను, మానవ సంబంధాలను ఈ కరోనా వైరస్ ఛిన్నాభిన్నం చేస్తున్న ఈ సమయంలో మనందరం కూడా స్వయం నియంత్రణ పాటిస్తూ, వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ యుద్ధం చేస్తున్నాం. అటువైపున మనందరి శ్రేయస్సు కోసం ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి.

మన ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్‌ గారు అహర్నిశలు, అలుపులేకుండా ప్రజాశ్రేయస్సే పరమావరిధిగా, తన పరిపాల దక్షతతో సరైన నిర్ణయాలతో తెలంగాణ గడ్డ మీదున్న ప్రతీ ఒక్కరినీ కాపాడే దిశగా, కొండంత అండగా, నిలువెత్తు మానవత్వంతో మనందరికోసం, మనకోసం నడుస్తున్నందుకు కేసీఆర్‌ సర్‌... నిన్ను నాయినా అని పిలవాలని ఉందే.. పిలవనా?

మొన్న టీవీలో నిన్ను చూసినంక, నీ మాట‌లు ఇన్నంకా, నీ చెయ్యితోని మా కండ్ల నీళ్లు తుడిచినట్టు, మా భుజాల మీద చేయి వేసి ధైర్యం చెప్పిన‌ట్టు.. మా ఇంట్లో మ‌నిషివైన‌ట్టు కొట్టిందే. నిన్ను నాయినా అని పిల‌వాల‌నుంది, పిల‌వ‌నా నాయినా? నాయనా... మొన్న నువ్వు ఇచ్చిన భరోసాకు ఆల్లు ఈల్లని కాదే. మొత్తం అందరు ఊపిరి పీల్సుక్నురు. పానాలు లేచివచ్చినయ్‌ అన్నరు. తెలంగాణ వెన్నుపూసగ నిలిచినవ్‌. గుండె దమ్మువై నడుస్తున్నవే. మా బాగోగులు పట్టించుకుంటున్నవ్‌. నిన్ను చూసినా, నీ మాట‌లిన్నా బ్ర‌తుకుమీద న‌మ్మ‌కం వ‌స్త‌ది. భ‌యం అన్న‌ది ఆమ‌డ దూరం బోత‌ది. దేన్నైనా జ‌యిస్తాం అనిపిస్త‌ది. మేం చేసుకున్న అదృష్ట‌మే నువ్వు. ఇది నా ఒక్క‌డి మాట కాదు. ఒక్క తెలంగాణ మాట కాదు. తెలుగోళ్లందరి మాట.  

అందరు సల్లగుండాలె, మనుషులు పోతే వస్తరా అని మానవ వనరుల విలువ చెప్తుంటివి. తెలంగాణ బిడ్డ‌లే కాదు ఈ గడ్డ‌మీద వున్న ఏ బిడ్డ కూడా ఉపాసం పండొద్ద‌ని అమ్మ‌లెక్క అర్సుకున్న‌వ్. ఆఫీసర్లకి ఆర్డర్లిస్తుంటివి. ఆపన్నుల ఆదుకుంటుంటివి. అనాథల అక్కున చేర్చుకుంటివి. గీ కరోనాని తరుముకుంట పానాలు నిలుపుతుంటివి. ప్రధాన మంత్రి అంటే దేశానికి బడి లెక్కన. మంచి మాట ఎవరన్నా వినాలని, మంచి బాట ఎవ్వరు చూపినా నడవాలని, ప్రమాదంల పార్టీని చూడొద్దని, మానవత్వం నేర్పిస్తుంటివి. మానవ జన్మ పునరుద్దరిస్తుంటివి. ఇరుగు పొరుగోళ్లకు ఆదర్శమైతివి" అంటూ చెబుతూ, ఓ సుదీర్ఘ వీడియోను ఉత్తేజ్ పోస్ట్ చేశారు.

ఆపై తన ప్రసంగంలో అప్పుడెప్పుడో ఎన‌క‌ట శ్రీ‌కృష్ణుడు గోవ‌ర్ధ‌న ప‌ర్వ‌త‌మెత్తినట్టు, ప్రజల ఆకలి, అప్పుల బాధలను తీర్చేందుకు పేదోళ్ల పాలిట పరమాత్ముడిలా కేసీఆర్ నిలిచారని పొగడ్తలు కురిపించారు. కేసీఆర్ తమకు క‌నిపించే దేవుడని, నువ్వు స‌ల్ల‌గుండాలని తన వీడియోలో పేర్కొన్నాడు.


More Telugu News