అచ్చం భూమి లాంటి మరో గ్రహం... కెప్లర్ పాత డేటా పరిశీలనతో వెలుగులోకి!

  • 300 కాంతి సంవత్సరాల దూరంలో గ్రహం
  • కాంతి, పరిణామంలో భూమితో సారూప్యత
  • అక్కడి వాతావరణంపై సమాచారం లేదు
  • కెప్లర్ పాత డేటాను విశ్లేషించగా విషయం వెలుగులోకి
అంతరిక్షంలో నూతన విషయాన్వేషణలో శాస్త్రవేత్తలకు సహకరిస్తున్న నాసా వారి కెప్లర్ టెలిస్కోప్ అందించిన పాత సమాచారం, భూమిని పోలివున్న ఓ గ్రహం ఉన్నట్టు వెల్లడించింది. ఈ గ్రహాన్ని గుర్తించిన కెప్లర్, ఎన్నడో దానికి సంబంధించిన సమాచారాన్ని నాసాకు పంపించినా, టెక్నికల్ సమస్యల కారణంగా అధికారులు దాన్ని తెలుసుకోలేకపోయారు. ఎన్నో సంవత్సరాల తరువాత కెప్లర్ డేటాను తిరగదోడుతుంటే, ఈ గ్రహం సంగతి వెలుగులోకి వచ్చింది.

ఈ గ్రహం ఓ ఎర్రని మరుగుజ్జు నక్షత్రం చుట్టూ తిరుగుతోందని, భూమికి 300 కాంతి సంవత్సరాల దూరంలో ఉందని, భూమితో పోలిస్తే 1.06 రెట్లు పెద్దదిగా ఉందని, సూర్యుని నుంచి భూమిపైకి ప్రసరించే కాంతిలో 75 శాతం కాంతి, ఈ గ్రహంపై సమీపంలోని నక్షత్రం నుంచి పడుతోందని కెప్లర్ గుర్తించింది. 2018లో ఇంధనం నిండుకోవడంతో కెప్లర్ పనిచేయడం ఆగిపోయిన తరువాత, అది గతంలో పంపిన సమాచారాన్ని శాస్త్రవేత్తలు మరోసారి తిరగేశారు.

ఈ గ్రహానికి కెప్లర్ - 1649సీ అని పేరు పెట్టారు. ఈ గ్రహం కూడా దాని సౌర కుటుంబంలో మూడో స్థానంలోనే ఉండటం గమనార్హం. ఈ గ్రహం కూడా శిలలతో నిండి ఉందని తెలుస్తుండగా, అక్కడ ఎలాంటి వాతావరణం ఉందన్న విషయంపై మాత్రం సమాచారం లేదు. మిగిలిన లక్షణాలన్నీ భూమితో పోలి ఉన్నా వాతావరణం అనుకూలించకపోతే ఈ గ్రహంపై మానవ మనుగడ అసాధ్యమేనని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. భూమికి అత్యంత సుదూరంలోనే ఉన్నప్పటికీ, ఈ తరహా గ్రహాలపై పరిశోధనలు చేయడం వల్ల భవిష్యత్తులో మంచి ఫలితాలను చూడవచ్చని నాసా అంచనా వేస్తోంది.


More Telugu News