రూ.1.20 లక్షల కోట్లు విడుదల చేశాం: లాక్‌డౌన్‌ నేపథ్యంలో కీలక విషయాలు తెలిపిన ఆర్‌బీఐ గవర్నర్

  • సూక్ష్మ ఆర్థిక సంస్థలకు రూ.50 వేల కోట్లు ఇచ్చాం
  • రివర్స్ రెపోరేటు 4 శాతం నుంచి 3.75 శాతానికి తగ్గింపు
  • రాష్ట్రాలకు 60 శాతం మేర డబ్ల్యూఎంఏ పెంపు
  • ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం నెలకొంది
  • బ్యాంకుల్లో సరిపడా ద్రవ్య లభ్యత ఉంది
లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఇప్పటికే రూ.1.20 లక్షల కోట్లు విడుదల చేశామని భారతీయ రిజర్వు బ్యాంకు గవర్నర్ శక్తికాంతదాస్‌ తెలిపారు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌తో దేశ ఆర్థిక వ్యవస్థ క్షీణిస్తోన్న నేపథ్యంలో ఈ విషయాలపై ఆయన ఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ కీలక విషయాలు తెలిపారు.

సూక్ష్మ ఆర్థిక సంస్థలకు రూ.50 వేల కోట్లు ఇచ్చామన్నారు. రెపోరేటు యథాతథంగా ఉంటుందని చెప్పారు. రివర్స్‌ రెపోరేటు మాత్రమే 25 బేసిస్‌ పాయింట్లు తగ్గిస్తున్నట్లు వివరించారు. రివర్స్ రెపోరేటు 4 శాతం నుంచి 3.75 శాతానికి తగ్గిస్తున్నట్లు వివరించారు. రాష్ట్రాలకు 60 శాతం మేర డబ్ల్యూఎంఏ పెంచుతున్నట్లు తెలిపారు. సెప్టెంబరు వరకు ఇది అమల్లో ఉంటుందని వివరించారు. ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం నెలకొందని అన్నారు.

ఇటువంటి సమయంలో బ్యాంకులు అందిస్తోన్న సేవలు ప్రశంసనీయంగా ఉన్నాయని చెప్పారు. ప్రస్తుతం ప్రపంచ మార్కెట్లన్నీ ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాయని తెలిపారు. పరిస్థితులకు అనుగుణంగా చర్యలు తీసుకోవాల్సి ఉందని చెప్పారు. జీడీపీలో 3.2 శాతం ద్రవ్యాన్ని అందుబాటులోకి తెచ్చామని శక్తికాంత దాస్ తెలిపారు.

బ్యాంకుల్లో సరిపడా ద్రవ్య లభ్యత ఉందని వివరించారు. కరోనాతో లాక్‌డౌన్‌ విధించిన నేపథ్యంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులను తాము క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని చెప్పారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో మొబైల్‌ బ్యాంకింగ్‌ సేవలు సజావుగా సాగుతున్నాయని ఆయన వివరించారు. మారటోరియం సమయంలో 90 రోజుల ఎన్‌పీఏ గడువు వర్తించబోదని ఆయన చెప్పారు.

బ్యాంకులు, ఆర్థిక సంస్థల కార్యకలాపాలను సాధారణ స్థితికి తెచ్చేందుకు కృషిచేయాల్సి ఉందని ఆయన చెప్పారు. ఆర్‌బీఐ చర్యల వల్ల బ్యాంకుల్లో సరిపడా ద్రవ్య లభ్యత ఉందని తెలిపారు. మార్చి నెలలో ఆటోమొబైల్ ఉత్పత్తుల అమ్మకాలు తగ్గాయని తెలిపారు.

విద్యుత్‌ వినియోగం బాగా తగ్గిందని చెప్పారు. లాక్‌డౌన్‌ వల్ల ప్రపంచ జీడీపీకి 9 ట్రిలియన్ డాలర్ల నష్టం వాటిల్లిందన్నారు. ఏప్రిల్‌లో ఆహార ఉత్పత్తుల ధరలు 2.3 శాతం పెరిగాయని వివరించారు.


More Telugu News