సిక్కు నిహంగ్ ల దాడిలో చేయి కోల్పోయిన పోలీసుకు ఎస్సైగా ప్రమోషన్!

  • కర్ఫ్యూ పాస్‌లు చూపించమన్నందుకు దాడి
  • ఏఎస్సై చేయి నరికిన దుండగుడు
  • దాడిలో గాయపడిన మరో ముగ్గురికి ప్రశంసలు
పంజాబ్‌లోని పాటియాలలో సిక్కు నిహంగ్ ల (ఆయుధాలు ధరించిన సిక్కులు) చేతిలో దాడికి గురైన ఏఎస్సైకి ఎస్సైగా పదోన్నతి లభించింది. నిహంగ్ లతో పోరాడిన అతడి ధైర్యానికి గుర్తింపుగా అధికారులు పదోన్నతి కల్పిస్తూ గురువారం ఆదేశాలు జారీ చేశారు.

కర్ఫ్యూ అమల్లో ఉండగా కూరగాయల మార్కెట్లోకి వచ్చిన నిహంగ్ లను అక్కడే ఉన్న పోలీసుల బృందం అడ్డుకుంది. కర్ఫ్యూ పాస్‌లు చూపించాలంటూ 50 ఏళ్ల ఏఎస్సై హర్జీత్ సింగ్ వారిని కోరాడు. దీంతో రెచ్చిపోయిన నిహంగ్ లు పోలీసులపై దాడి చేశారు. హర్జీత్ సింగ్ చేతిని కత్తితో నరికారు. ఈ ఘటనలో మరో ముగ్గురు పోలీసులు, మార్కెట్ అధికారి కూడా గాయపడ్డాడు.

చేయి తెగిపోయి రక్తపు మడుగులో విలవిల్లాడుతున్న హర్జీత్‌ సింగ్‌ను వెంటనే పోస్టు గ్రాడ్యుయేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ హాస్పిటల్ (పీజీఐఎంఈఆర్)కు తరలించారు. అక్కడ అతడి చేతిని వైద్యులు విజయవంతంగా తిరిగి అతికించారు. నిహంగ్ ల దాడిలో గాయపడిన మరో ముగ్గురు పోలీసులకు డైరెక్టర్ జనరల్ నుంచి ప్రశంసల డిస్క్ లభించింది.


More Telugu News