బత్తిని సోదరుల పేరిట బురిడీ.. కరోనా మందంటూ మోసం!

  • ‘నేచర్ కోవిడ్ అభయ’ పేరుతో నకిలీ మందు
  • బత్తిని హరినాథ్‌గౌడ్ ఫిర్యాదుతో రంగంలోకి పోలీసులు
  • ఐదుగురు సభ్యుల ముఠాలో నలుగురి అరెస్ట్
హైదరాబాదులోని బత్తిని సోదరుల పేరును ఉపయోగించుకుని ఆన్‌లైన్‌లో మోసానికి పాల్పడుతున్న ఓ ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉబ్బసానికి చేప ప్రసాదం పంపిణీ చేసే బత్తిని సోదరులు కరోనా వైరస్‌కు మందు కనిపెట్టారని ఇంటర్నెట్‌లో ప్రచారం చేస్తున్న కొందరు వ్యక్తులు నకిలీ మందులు అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు. బత్తిని సోదరుల్లో ఒకరైన హరినాథ్‌గౌడ్ దృష్టికి ఈ విషయం చేరడంతో ఆయన జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు తమకు మందు కావాలంటూ నిందితులను ఆశ్రయించారు. పోలీసులు గూగుల్ పే ద్వారా డబ్బులు చెల్లించడంతో నేరేడ్‌మెట్‌కు చెందిన యువకుడు మేరిగ మహేంద్ర ‘నేచర్ కోవిడ్ అభయ’ పేరుతో చిన్న ప్లాస్టిక్ డబ్బాలో ఉన్న మందును తీసుకొచ్చాడు.

ఆరు గ్రాములు ఉన్న ఆ మందు ఖరీదు రూ.285. నిందితుడు మహేంద్రను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడిచ్చిన సమాచారంతో కీలక సూత్రధారి బత్తిని రాజ్‌కుమార్ సహా నలుగురిని అరెస్ట్ చేశారు. మరో నిందితుడిని అరెస్ట్ చేయాల్సి ఉందని పోలీసులు తెలిపారు. కీలక నిందితుడైన రాజ్‌కుమార్‌ తన ఇంటి పేరును ఉపయోగించుకుని మోసానికి పాల్పడుతున్నాడని పోలీసులు తెలిపారు.


More Telugu News