పాత ఫ్రిజ్ తో కరోనా నిర్మూలన పరికరం... కర్ణాటక నిపుణుల ఆవిష్కరణ

  • జీరో కరోనా వైరస్ పరికరాన్ని రూపొందించిన ఎన్ఐటీకే నిపుణులు
  • పరికరంలో వస్తువులు ఉంచితే క్రిములు నాశనం
  • 99.9 శాతం క్రిమి సంహారం జరుగుతుందన్న నిపుణులు
కరోనా వైరస్ అనేది ఇప్పుడు ప్రజల జీవితాల్లో అత్యంత ముఖ్యాంశంగా మారింది. దీన్ని అధిగమించడం ఎలా అన్నదే ప్రభుత్వాలు, ప్రజల ఏకైక అజెండా. అయితే, 50 డిగ్రీల ఉష్ణోగ్రతను కూడా తట్టుకుని మనుగడ సాగించగలిగే కరోనా వైరస్ భూతాన్ని సైతం నిర్మూలించవచ్చని కర్ణాటకకు చెందిన కొందరు సాంకేతిక నిపుణులు చెబుతున్నారు.

ఈ మేరకు వారు ఓ పాత రిఫ్రిజిరేటర్ ను కరోనా నిర్మూలన పరికరంగా మార్చారు. దీనిని జీరో కరోనా వైరస్ (డిసిన్ఫెక్షన్ చాంబర్) పరికరంగా పిలుస్తున్నారు. కర్ణాటకలోని సూరత్ కల్ లో ఉన్న నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీకే) కెమిస్ట్రీ డిపార్ట్ మెంట్ హెడ్ డాక్టర్ అరుణ్ ఎం ఇస్లూర్, పరిశోధక విద్యార్థి సయ్యద్ ఇబ్రహీం సంయుక్తంగా ఈ జీరో కరోనా పరికరాన్ని రూపొందించారు.

దీంట్లో ఎలాంటి వస్తువులను ఉంచినా, వాటిపై ఉన్న సూక్ష్మక్రిములను ఇది నాశనం చేస్తుందని, ఇది 99.9 శాతం కచ్చితమైన ఫలితాలను ఇస్తుందని డాక్టర్ ఇస్లూర్ తెలిపారు. కూరగాయలు, పండ్లు, పుస్తకాలు, కరెన్సీ నోట్ల, కవర్లు.. ఇలా ఏ వస్తువును దీంట్లో ఉంచినా ఇన్ఫెక్షన్ రహితంగా మార్చేస్తుందని వివరించారు. 15 నిమిషాల సేపు స్విచాన్ చేస్తే చాలని, ఆయా వస్తువులపై వుండే ఎటువంటి సూక్ష్మ క్రిములనైనా దాదాపుగా రూపుమాపుతుందని వెల్లడించారు.


More Telugu News