లాక్ డౌన్ నేపథ్యంలో కఠినంగా వ్యవహరిస్తున్న తెలంగాణ సర్పంచ్ లు!

  • తల్లిని కూడా గ్రామంలోకి రానివ్వని ఓ సర్పంచ్
  • చేత కర్ర పట్టుకుని కాపలా కాస్తున్న ఓ మహిళా సర్పంచ్
  • ఆసక్తికర బ్యానర్లతో తెలంగాణలో కరోనా చైతన్యం
కరోనా కట్టడి కోసం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేస్తున్నారు. తెలంగాణలోని చిన్న గ్రామాలు సైతం లాక్ డౌన్ నిబంధనలను కచ్చితంగా పాటిస్తున్నాయి. ముఖ్యంగా అక్కడి సర్పంచ్ లు ముందుండి కరోనా కట్టడి చర్యల్లో పాలుపంచుకుంటున్నారు.

సంగారెడ్డి జిల్లాలోని సిర్గాపూర్ మండలంలోని గోసాయిపల్లిలో ఆ గ్రామ సర్పంచ్ సాయి గౌడ్ నేతృత్వంలో కరోనా కట్టడి చర్యలను తిరుగులేని విధంగా అమలు చేస్తున్నారు. ఇటీవల సాయి గౌడ్ తల్లి తులసమ్మ బంధువుల ఇంటికి వెళ్లింది. అయితే తిరిగి గ్రామంలో ప్రవేశిస్తుండగా, సర్పంచ్ సాయిగౌడ్ అడ్డుకున్నాడు. తల్లి అయినా సరే నిబంధనలు పాటించాల్సిందేనని, లాక్ డౌన్ సమయంలో బయటి నుంచి గ్రామంలోకి ఎవరినీ అనుమతించేది లేదని కరాఖండీగా చెప్పేశాడు. తిరిగి బంధువుల ఇంటికే వెళ్లాల్సిందిగా తల్లికి స్పష్టం చేశాడు. దాంతో చేసేది లేక తులసమ్మ బంధువుల ఇంటికి తిరిగి వెళ్లింది.

తెలంగాణలోనే ఓ యువ మహిళా సర్పంచ్ కూడా ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చేతిలో కర్ర పట్టుకుని ఆమె గ్రామ సరిహద్దుల వద్ద కాపలాగా నిలుచున్న వైనం అందరి దృష్టిని ఆకర్షించింది. ఆమె పేరు ఉడుతా అఖిలా యాదవ్. వయసు 23 ఏళ్లు. మదనాపురం గ్రామానికి సర్పంచ్. గ్రామ ప్రవేశ ప్రాంతం వద్ద కర్రతో నిలుచుని లాక్ డౌన్ నిబంధనలు అమలు చేస్తూ అందరికీ స్ఫూర్తిగా నిలిచింది. అంతేకాదు, తెలంగాణలోని పలు గ్రామాల్లో ఆసక్తికర బ్యానర్లు దర్శనమిస్తున్నాయి. 'మీరు మా గ్రామానికి రావొద్దు, మేం మీ గ్రామానికి రాబోము' అంటూ ఖమ్మం జిల్లాలో కొణిజెర్ల మండలం తనికెళ్ల గ్రామంలో బ్యానర్ ప్రదర్శించారు.


More Telugu News