చైనా నుంచి 6.5 లక్షల మెడికల్ కిట్లతో భారత్ బయల్దేరిన విమానం

  • భారత్ కు రాపిడ్ యాంటీబాడీ కిట్లు పంపిన చైనా
  • తదుపరి రెండు వారాల్లో మరో 2 మిలియన్ల కిట్లు పంపనున్న చైనా
  • వెంటిలేటర్లు, పీపీఈలు భారీగా తయారుచేస్తున్న డ్రాగన్ దేశం
అన్ని దేశాల కంటే ముందు కరోనా విజృంభణ చవిచూసిన చైనా తాజాగా భారత్ కు 6.5 లక్షల కరోనా మెడికల్ కిట్లను పంపించింది. వాటిలో రాపిడ్ యాంటీబాడీ టెస్టింగ్ కిట్లు, ఆర్ఎన్ఏ ఎక్స్ ట్రాక్షన్ కిట్లు కూడా ఉన్నాయి. ఈ తెల్లవారుజామున చైనాలోని గ్వాంగ్ జౌ విమానాశ్రయం నుంచి మెడికల్ కిట్లతో విమానం భారత్ కు బయల్దేరిందని బీజింగ్ లోని భారత రాయబారి విక్రమ్ మిస్రీ వెల్లడించారు. తదుపరి 15 రోజుల్లో మరో 2 లక్షల టెస్టింగ్ కిట్లు చైనా నుంచి భారత్ కు వస్తాయని వివరించారు.

చైనాలో రెండు నెలల లాక్ డౌన్ విరామం తర్వాత కర్మాగారాలు తెరుచుకున్నాయి. ఈ నేపథ్యంలో కరోనాతో పోరాడుతున్న ఇతర దేశాలకు వైద్య సరంజామా ఎగుమతి చేయడం ద్వారా నష్టాలను కొంతమేర పూడ్చుకోవాలని డ్రాగన్ దేశం భావిస్తోంది. అందుకే యుద్ధ ప్రాతిపదికన వెంటిలేటర్లు, పీపీఈలు తయారుచేస్తోంది. భారత్ నుంచి ప్రభుత్వం, ప్రైవేటు సంస్థలు కూడా చైనా తయారీ పీపీఈలు, వెంటిలేటర్లు, మెడికల్ కిట్ల కోసం భారీగా ఆర్డర్లు ఇచ్చినట్టు తెలుస్తోంది.


More Telugu News