బయట ఎందుకు తిరుగుతున్నారని ప్రశ్నించిన వృద్ధురాలిపై కత్తితో దాడి

  • అడ్డుకున్న ఆమె కొడుకుపైనా దౌర్జన్యం
  • తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ ఆలయం వద్ద ఘటన
  • స్వల్పగాయాలతో ఆసుపత్రిపాలైన తల్లీకొడుకులు
లాక్‌డౌన్‌ వేళ విచ్చలవిడిగా బయట తిరుగుతున్న యువకులను మందలించి, ఇళ్లకు వెళ్లిపోండని చెప్పిన పాపానికి ఓ వృద్ధురాలిపై ఆరుగురు యువకులు దాడిచేసిన ఘటన తిరుపతిలో చోటు చేసుకుంది.

పోలీసుల కథనం మేరకు...నగరంలోని తాతయ్యగుంట గంగమ్మ ఆలయం సమీపంలో ఓ వృద్ధురాలు పాన్‌షాపు నడుపుతోంది. ప్రస్తుతం లాక్‌డౌన్‌ అమల్లో ఉండడంతో రోడ్లపై ఎవరూ తిరగ కూడదన్న నిబంధన ఉన్నా ఆరుగురు యువకులు తన షాప్‌ వద్ద తచ్చాడుతుండడం గమనించిన వృద్ధురాలు వారిని ప్రశ్నించింది.

ఈ సమయంలో ఇక్కడ ఎందుకు తిరుగుతున్నారని ప్రశ్నించింది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన యువకులు ఆమెపై దౌర్జన్యం చేయగా, ఒకడు కత్తితో దాడి చేశాడు. దీన్ని గమనించిన ఆమె కొడుకు అడ్డుకునే ప్రయత్నం చేయగా అతనిపైనా దాడిచేశారు. దీంతో ఇద్దరికీ స్వల్పగాయాలయ్యాయి. యువకులు రోడ్డుపై కత్తులతో హల్‌చల్‌ చేసిన వైనం అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డు కావడంతో నిందితుల కోసం పోలీసులు ఆరాతీస్తున్నారు.


More Telugu News