టీడీపీ సీనియర్‌ నేత, మాజీ ఎంపీ తులసీరామ్‌ మృతి

  • సర్పంచ్‌గా రాజకీయ జీవితం ప్రారంభం
  • మూడుసార్లు ఎంపీగా ఎన్నికైన నేత
  • రంగారెడ్డి జిల్లా శివరాంపల్లిలో విషాదం
సీనియర్‌ టీడీపీ నాయకుడు, మాజీ ఎంపీ వి.తులసీరాం(86) కన్నుమూశారు. గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈరోజు ఉదయం రంగారెడ్డి జిల్లా శివరాంపల్లిలోని  స్వగృహంలోనే తుదిశ్వాస విడిచారు.  సర్పంచ్‌గా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి పార్లమెంటులో అడుగుపెట్టిన నేతగా రంగారెడ్డి జిల్లా వాసులకు ఆయన చిరపరిచితులు. ఎన్టీఆర్‌ తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత ఆయన సలహాదారుల్లో ఒకరిగా తులసీరాం చాలాకాలం కొనసాగారు. 1959లో రాజకీయ అరంగేట్రం చేసిన ఆయన 1971 వరకు కాటేదాన్‌ సర్పంచ్‌గా సుదీర్ఘకాలం కొనసాగారు.

ఆ తర్వాత రాజేంద్రనగర్‌ సమితి ప్రెసిడెంట్‌గా కూడా బాధ్యతలు నిర్వహించారు. తెలంగాణ ప్రజా సమితి తరపున పెద్దపల్లి పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి 1969లో ఎంపీగా ఎన్నికై ఢిల్లీ సభలో అడుగుపెట్టారు. ఆ తర్వాత కాంగ్రెస్‌ పార్టీలో చేరి అదే నియోజకవర్గం నుంచి రెండోసారి ఎంపీగా ఎన్నికయ్యారు.

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌కు దగ్గరయ్యారు. పార్టీలో చేరి ఆయనకు రాజకీయ సలహాలు ఇస్తుండేవారు. 1985లో నాగర్‌కర్నూల్‌ నుంచి ఎంపీగా పోటీ చేసి మూడోసారి పార్లమెంటులోకి అడుగుపెట్టారు. రంగారెడ్డి జిల్లా టీడీపీ అధ్యక్షునిగా కూడా కొన్నాళ్లు పనిచేశారు.


More Telugu News