ఈ బంధం ఏనాటిదో... పోలీసు అధికారిని వదిలి ఉండలేకపోతున్న లేగదూడ!

  • కారు వెనుక సీట్లో కనిపించిన లేగదూడ
  • తీసుకుని వచ్చి ఆలనా పాలనా చూసిన అధికారి
  • ఇంటి సభ్యుడిగా ఆదరిస్తున్న మహమ్మద్ రఫీ
కర్ణాటకలోని బ్యాప్పన హళ్లిలో ఓ పోలీసు అధికారి పట్ల అమితమైన వాత్సల్యాన్ని చూపుతూ, అతన్ని వదిలి ఉండలేకపోతున్న ఓ లేగదూడ ఉదంతం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. వివరాల్లోకి వెళితే, మార్చి 30న రాత్రిపూట, సమీపంలోని చెక్ పోస్ట్ వద్ద స్థానిక పోలీసు ఇనస్పెక్టర్ మహమ్మద్ రఫీ, తనిఖీలు చేస్తున్న వేళ, ఓ కారు వెనుక సీట్లో కవర్ తో చుట్టి ఉన్నలేగదూడ కనిపించింది. ఆ లేగదూడ రోడ్డుపై ఒంటరిగా ఉంటే, తమతో పాటు తీసుకుని వెళుతున్నామని కారులోని వారు పోలీసులకు చెప్పారు. ఆపై విచారణలో భాగంగా, లేగదూడను తనతో పాటు ఉంచుకున్న రఫీ దాని ఆలనా, పాలనా చూశారు. ఈలోగా, కారులో వచ్చిన వారు చెప్పింది నిజమేనని తేలింది.

ఈలోగా, రఫీ దానికి బీమా అని పేరు పెట్టి, దాని బాధ్యతలను తానే చూశారు. ఇక, ఆ లేగదూడ, రఫీ వద్దకు వచ్చినప్పటి నుంచి అతన్ని వదిలి ఉండటం లేదు. ఆయన ఎక్కడికి వెళితే, అక్కడికి వెళుతోంది. దీనికి ఆహారంగా, రోజుకు 20 లీటర్ల పాలు, పప్పు ధాన్యాలను అందిస్తున్న రఫీ, దాన్ని తమ ఇంటి సభ్యుడిగా భావిస్తూ ఆదరిస్తున్నారు. తాను ఇక్కడి నుంచి ట్రాన్స్ ఫర్ అయినా కూడా బీమా తనతో పాటే ఉంటుందని, దాన్ని తీసుకునే వెళతానని ఆయన అంటున్నారు. ఇక వీరిది జన్మజన్మల బంధం అయ్యుంటుందని స్థానికులు అంటున్నారు.


More Telugu News