ఆంగ్ల మాధ్యమంపై కోర్టు ఉత్తర్వుల్లో స్పష్టత లేదు: ఐవైఆర్

  • తెలుగు మాత్రమేనా?  లేదా ఆంగ్ల మాధ్యమాన్ని కూడా ఎంపిక చేసుకునే స్వేచ్ఛ ఉందా?
  • రెండోది అయితే కోర్టు నిర్ణయాన్ని స్వాగతించాల్సిందే
  • ఆంగ్ల మాధ్యమానికే అవకాశం లేదంటే ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేయాలని సూచన
ఆంగ్ల మాధ్యమం తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవోలను హైకోర్టు కొట్టివేయడంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు స్పందించారు. ఈ విషయంలో కోర్టు ఉత్తర్వుల్లో స్పష్టత లేదని అన్నారు. కేవలం తెలుగులోనే చదవాలా? లేక  తెలుగు, ఆంగ్ల మాధ్యమంలో ఏదో ఒకదాన్ని ఎంచుకునే సౌలభ్యం ఉంటుందా? అని ప్రశ్నించారు.

ఒకవేళ ఆంగ్ల మాధ్యమాన్ని ఎంచుకునే అవకాశం ఇస్తే మాత్రం దాన్ని స్వాగతించాలని అన్నారు. ఆంగ్లం సహా ఏ మాధ్యమాన్ని అయినా ఎంచుకునే స్వేచ్ఛ ప్రాధమిక హక్కు అని అన్నారు. ఈ మేరకు ఆయన ఆంగ్లం, తెలుగులో వరుస ట్వీట్స్ చేశారు.  

‘నిర్బంధ ఆంగ్ల మాధ్యమం రాజ్యాంగ విరుద్ధమా లేక అసలు ఆంగ్ల మాధ్యమమే రాజ్యాంగ విరుద్ధమా? నాకు స్పష్టత దొరకలేదు. ఒకవేళ మొదటి అంశమైతే స్వాగతించ వలసిన విషయం. మాధ్యమాన్ని ఎంపిక చేసుకునే స్వేచ్ఛ విద్యార్థుల తల్లిదండ్రులకు ఉండాలి అనేది మొదటి నుంచి నా వాదన. ఒకవేళ హైకోర్టు ఉత్తర్వు.. అసలు ఆంగ్ల మాధ్యమాని కే అవకాశం లేదు అని చెప్పి ఉంటే మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీనిపై సుప్రీంకోర్టుకి వెళ్లాలి లేదా హైకోర్టులో రివ్యూ పిటిషన్ వేయాలి’ అని ఆయన ట్వీట్ చేశారు.


More Telugu News