చైనా నుంచి 50 వేల పీపీఈ కిట్స్ అందుకున్న అసోం!

  • చైనా నుంచి డైరెక్ట్ గా దిగుమతి
  • చైనా నుంచి పొందిన తొలి రాష్ట్రంగా అసోం
  • త్వరలోనే డాక్టర్లు, హెల్త్ వర్కర్లకు పంపిణీ
దేశమంతటికీ కరోనా భయం పట్టుకున్న వేళ, చైనా నుంచి మొట్టమొదటిగా, పీపీఈ (పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్ మెంట్) కిట్స్ ను దిగుమతి చేసుకున్న రాష్ట్రంగా అసోం నిలిచింది. చైనాలోని గాంగ్జౌ నుంచి టేకాఫ్ అయి, బుధవారం రాత్రి 8.15 గంటల ప్రాంతంలో గౌహతి ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయిన బ్లూ డార్ట్ విమానం, 50 వేల పీపీఈ కిట్స్ ను తీసుకుని వచ్చింది. ఎన్నో ప్రపంచ దేశాలు పీపీఈ కిట్స్ కోసం చైనా వైపు చూస్తున్న వేళ, చైనా అసోంకు వీటిని పెద్ద ఎత్తున పంపించడం గమనార్హం.

ప్రస్తుతం అసోంలో కేవలం 32 కరోనా పాజిటివ్ కేసులు మాత్రమే ఉన్నాయి. రాష్ట్రాల సగటుతో పోల్చినా, కేసుల సంఖ్య పరంగా చూసినా, ఇది చాలా తక్కువే. ఇక విమానాశ్రయంలో పీపీఈ కిట్స్ ను రాష్ట్ర ఆరోగ్య మంత్రి హిమాంత బిశ్వ శర్మ స్వీకరించారు. "భారత ప్రభుత్వంతో పాటు చాలా దేశాలు చైనా నుంచి పీపీఈ కిట్స్ ను దిగుమతి చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. అమెరికా కూడా పీపీఈల కోసం చైనా వైపే చూస్తోంది. వీటిని చైనా నుంచి డైరెక్ట్ గా దిగుమతి చేసుకున్న తొలి రాష్ట్రంగా అసోం నిలిచింది" అని ఆయన అన్నారు.

మొత్తం 2 లక్షల కిట్స్ ను సిద్ధంగా ఉంచుకోవాలని తాము భావిస్తున్నామని తెలిపింది. కాగా, కొవిడ్-19 వెలుగులోకి రాకముందు అసోం రాష్ట్రం మొత్తంలో కేవలం 10 పీపీఈ కిట్స్ మాత్రమే ఉండేవి. సమీప భవిష్యత్తులో ఈ కిట్స్ పరిమిత సంఖ్యలోనే అందుబాటులోకి వస్తాయని అభిప్రాయపడ్డ హిమాంత బిశ్వ, ముందుజాగ్రత్తగా వీటిని సిద్ధం చేసుకుంటున్నామని తెలిపారు. త్వరలోనే వీటిని డాక్టర్లు, హెల్త్ వర్కర్లకు అందిస్తామని తెలిపారు.

వాస్తవానికి పీపీఈ కిట్స్ ను డైరెక్ట్ గా చైనా నుంచి దిగుమతి చేసుకోవడం ఓ రాష్ట్రానికి అంత సులువేమీ కాదు. ఎన్నో పెద్ద రాష్ట్రాలు, మరిన్ని వనరులుండి కూడా కిట్స్ ను ఇంపోర్ట్ చేసుకునేందుకు అవస్థలు పడుతున్నాయి. భారత మాన్యుఫాక్చరింగ్ సంస్థల నుంచి తమకు కేవలం వందల సంఖ్యలోనే కిట్స్ అందాయని చెప్పిన అసోం ఆరోగ్య శాఖ ఉన్నతాధికారి ఒకరు, కరోనాను ఎదుర్కునేందుకు తాము సర్వసన్నద్ధంగా ఉన్నామని అన్నారు.


More Telugu News